Published On: Mon, Apr 23rd, 2018

కన్నతల్లిని క‌ట్టేసి హింసిస్తున్న కొడుకు, కోడలు అరెస్టు

* వృద్ధురాలి ద‌య‌నీయ స్తితి చూసి చ‌లించిన పోలీసులు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని చివరి వయసులో సరిగా చూడకుండా, ఎండలో ఇనుప గొలుసుతో కట్టేసి హింసకు గురిచేసిన కొడుకు అతని భార్యను ఆదివారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. గుణదల బెత్లహేంనగర్‌కు చెందిన ప్రకాశమ్మను కొన్ని నెలలుగా డాబాపైన మంచానికి గొలుసుతో కట్టేసి ఆహారం, నీరు లేకుండా ఎండలోనే ఉంచారు. స‌మాచారం అందుకున్న అధికారుల స్పందించి ప్రకాశమ్మను వృద్ధాశ్రమానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ సత్యానందం, మాచవరం సీఐ సాహేరాబేగం, ఎస్సై హనీష్‌ ఆదివారం గుణదలలోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఘటనపై విచారించారు. అనంతరం ప్రకాశమ్మ కొడుకు ఏసుదాసు, కోడలు మేరీలను అరెస్టు చేశారు. ప్రస్తుతం న్యూరాజరాజేశ్వరీ పేటలోని అరుణా మహిళా మండలి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ప్రకాశమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం సత్యానందం మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కన్నవారిని చూసుకునే బాధ్యత బిడ్డలపై ఉందని అన్నారు. దీనిపై పోలీసు శాఖ దృష్టిపెట్టిందని, ప్రత్యేకంగా వృద్ధమిత్ర అనే విభాగంతో వృద్ధులకు రక్షణ కల్పించి వసతి, భోజనం, భద్రత కల్పించడం వంటి బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉన్న వారు దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో లేదా, 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అనంతరం ప్రకాశమ్మకు దుస్తులు, ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సీఐ కొంత నగదును అందించి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు.
 

Just In...