Published On: Tue, Oct 13th, 2020

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షలు

* సీఎం జగన్‌కు ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతల కృతజ్ఞతలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల తక్షణ ఆర్థికసాయం అందజేసేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేయూ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్థన్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయిన శ్రీనివాసరెడ్డి జర్నలిస్టు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టు
కుటుంబ ఇబ్బందులు, ప్రస్తుతం అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటులో జరుగుతున్న లోపాలు, నివాస స్థలాలు తదితర సమస్యలను సీఎంకు వివరించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి తక్షణమే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించారని విజయవాడ ప్రెస్‌క్ల‌బ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రపంచాన్నిగడగడలాడించిన కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పారా మెడికల్ సిబ్బంది పాటు జర్నలిస్టులు కూడా ప్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారని ప్రధాని సైతం ప్రకటించారని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని గుర్తించి సాయం అందిస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు. దేశంలో అత్యధికంగా ఏపీలో 38 మంది జర్నలిస్టులు కరోనా వైరస్ కు బలయ్యారని జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు కూడా భాగస్వాములేనన్న విషయం గుర్తించాలని కోరామన్నారు అలాగే ఆక్రిడిటేషన్ కమిటీలో అతి పెద్ద జర్నలిస్టు యూనియన్‌గా ఉన్న ఏపీయూడబ్ల్యూజే ఇచ్చే ప్రాధాన్యతలో జరుగుతున్న అన్యాయంపై, జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. వీటిపై సీఎం స్పందిస్తూ మృతి చెందిన జర్నలిస్టుల జాబితా అందజేస్తే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వెంటనే రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో లోపాలను సరిచేసేందుకు అధికారులను ఆదేశించారు, జర్నలిస్టు నివాస స్థలాలపై కూడా న్యాయస్థానాల్లో చిక్కులు తొలగిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారని తెలిపారు. సీఎంతో పాటు, జర్నలిస్ట్ సమస్యలపై స్పందించిన జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు
కృతజ్ఞతలు తెలిపారు.

Just In...