Published On: Sat, Jan 16th, 2021

కరోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ గోడప్రతులు, కరపత్రాలు ముద్ర‌ణ‌

* ప్రభుత్వ ఆసుప‌త్రిలో ఆవిష్కరించిన సీయం వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో రూపొందించిన వివిధ గోడప్రతులను, ప్రచార సామాగ్రి పత్రాలను విడుదల చేశారు. శనివారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్ర‌భుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన అనంతరం ఐఇసి (ఇన్ఫర్ మేషన్ ఎ డ్యుకేషన్ కమ్యూనికేషన్) ప్రతులను విడుదల చేశారు. ఈప్రచార సామాగ్రిలో భాగంగా కోవిడ్-19 టీకా సురక్షితమైన దే అంటూ 8 అంశాలతో ముద్రించిన గోడప్రతిని, టీకా కోసం ప్రజలు చేయవలసిన సురక్షిత విధానాల పైన రూపొందించిన రెండు గోడప్రతులను, కోవిడ్ టీకా వేసుకునేందుకు నిర్దేశించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, విధివిధానాలతో రూపొందించిన గోడప్రతులను, కోవిడ్ వైరస్ సోకకుండా ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఐదు అంశాలతో రూపొందించిన  గోడప్రతి కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా కోవిడ్-19 టీకా కార్యక్రమంలో వాలంటీర్ల పాత్ర, సామాజిక కార్యకర్తలు అయిన ఆశా, అంగన్‌వాడీల పాత్ర, గ్రామ, వార్డు వాలంటీర్ల పాత్ర, గ్రామంలో/పట్టణంలో పలుకుబడి ఉండి ఇతరులను ప్రభావితం చేయగలిగేవారి పాత్ర, మత పెద్దలు/నాయుకుల పాత్రల పై రూపొందించిన మార్గదర్శకాల కరపత్రాలను విడుదల చేశారు. టీకా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న 50 ఏళ్ల లోపు ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరుస్తూ రూపొందించిన కరపత్రాలను కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు, కె.రక్షణనిధి, కైలే అనీల్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి యంటి. కృష్ణ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనీల్‌కుమార్ సింఘాల్, కమిషనర్‌ కె. భాస్కర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, జిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్‌ మాధవీలత, డిసిపి వి.హర్షవర్ధన్‌రాజు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Just In...