Published On: Sat, Apr 4th, 2020

కరోనాపై పోరాటంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర భేష్..

* కరోనా నివారణ కమిటీ సభ్యుడు విజయ్‌కుమార్ రెడ్డి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో మానవాళి మనుగడ కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రేయింబవళ్లు కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమైనవని రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కొనియాడారంటూ రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు (మీడియా మేనేజ్‌మెంట్) టి.విజయ్‌కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్య సాధనలో భాగంగా గత ఆరు నెలల నుంచి ప్రతి రెవెన్యూ ఉద్యోగి నవరత్నాల అమలుకు విశేష కృషి చేస్తున్నారని నీరబ్‌కుమార్ ప్రసాద్ తెలిపారన్నారు. ప్రపంచమంతా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగమంతా నిద్రాహారాలు మాని వైరస్ బాధితులను గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించడంలో నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారన్నారు. కంటికి కనిపించని శత్రువుపై అలుపెరగని పోరాటం చేస్తున్న రెవెన్యూ శాఖలోని జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు…ఇలా రెవెన్యూ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నట్లు నీరభ్ కుమార్ తెలిపారన్నారు. పోలీసు, వైద, ఆరోగ్య శాఖ వంటి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కరోనా తో యుద్ధం చేస్తున్న తీరు మెచ్చుకోదగ్గదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో పోరాటం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు రక్షణాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. మానవాళి మనుగడుకు అలుపెరగని పోరాటం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటం వృథా పోదని ఆ రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ ధీమా వ్యక్తం చేసినట్లు విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

Just In...