Published On: Mon, Aug 10th, 2020

కరోనా బాధితుల విష‌యంలో ప్ర‌భుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి

* విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గద్దె రామ‌మోహ‌న్‌

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో రోజుకు 10 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, సోమవారం నాటికి రాష్ట్రంలో 2,35,000 కేసులు దాటాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని, కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన వైద్య సహాయం అందజేయాలని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ సోమవారం నాడు ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రకటనలు చూస్తే కరోనా పేషెంట్లను గంటలోపు ఆసుపత్రిలో చేర్చి అన్ని రకాల వైద్య సహాయాలు అందిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులలో కరోనా పేషెంట్లను పట్టించుకుంటున్నవారు లేరని, అనుమానం వచ్చి టెస్టులు చేయించుకుందామంటే ఈనాటికి కూడా ఎక్కడ టెస్టులు చేస్తారో తెలియని పరిస్థితి అని అన్నారు.ఆర్ధికంగా ఉన్న వారు ఎంత ఖర్చయినా ప్రైవేటు హాస్పటల్స్ లో వైద్యం చేయించుకుంటున్నారని, పేదలు, మధ్యతరగతి వారు అటు డబ్బులు చెల్లించలేక , ఇటు ప్రభుత్వం నుంచి సరైన చేయూత లేక ప్రాణాలు వదులుతున్న సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా కేంద్రాలు పేషెంట్లకు ఎంత మాత్రం చాలటం లేదని, వైద్య సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం జరగుతుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా ఆరోగ్యశ్రీ పథకంలో ఎంత మందికి వైద్యం అందిందో తెలియజేయాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు ఆసుపత్రి వారు పట్టించుకోవడం లేదన్నారు. కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చి, కరోనా వైద్య ఆసుపత్రులను పెంచి, పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి వైద్య సౌకర్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Just In...