Published On: Mon, Sep 7th, 2020

కరోనా మ‌హ‌మ్మారి విలయ‌తాండ‌వం…!

* 24గంటల్లో 90వేల కేసులు న‌మోదు

* పాజిటీవ్ కేసుల్లో ప్రపంచంలో 2వ స్థానం దిశగా భారత్‌

* దేశవ్యాప్తంగా 31లక్షల మంది రికవరీ, 70వేలు దాటిన మరణాలు

దిల్లీ, సెల్ఐటి న్యూస్‌: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు
బయటపడుతున్నాయి. గడ‌చిన 24గంటల్లో అత్యధికంగా 90,632 మందిలో వైరస్‌ బయటపడింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు .. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కాలేదు. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41లక్షలకు (41,13,811) చేరింది. ఈ సంఖ్యతో కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌కు భారత్‌ చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 73వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది.
ఇక దేశంలో కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి వెయ్యి కొవిడ్‌ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే మరో 1065 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 70,626కు చేరింది. ప్రస్తుతం కొవిడ్‌ మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ టెస్టులు భారీ సంఖ్యలో చేపడుతున్నారు. ప్రతిరోజు దాదాపు 10లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే మరో 10లక్షల 92వేల టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది.
కొవిడ్‌ పరీక్షలు భారీ స్థాయిలో నిర్వహిస్తుండడంతో పాజిటివ్‌ కేసులు కూడా ఎక్కువగానే బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

Just In...