Published On: Sat, Mar 21st, 2020

“కరోనా వైరస్” పై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనా దేశంలో విస్తృతంగా వ్యాపించి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. కరోనా వైరస్ చైనా దేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రవేశించి ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మరియు అదనపు పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్ర‌వారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శుక్ర‌వారం విజయవాడ నగర పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూములో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అడ్మిన్ డిసిపి డి.మేరి ప్రశాంతి, మచిలీపట్నం నుండి వచ్చిన వైద్య నిపుణురాలు పి.జె.అమృత (కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్) హాజరై అధికారులు మరియు సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హజరైన వైద్య నిపుణుల బృందం మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకిన వారికి జలుబు, దగ్గు, ముక్కు కారటం, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వస్తాయని, తీవ్రమై ఊపిరితిత్తుల సమస్య మరియు మూత్రపిండాలు విఫలం కావడం వలన మరణాలు సంభవిస్తాయని తెలిపారు. ఈ వ్యాధి పక్షులు, క్షీరదాలు, గబ్బిలాలు, పాములు నుండి, మనుషులకు, మనుషులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గాలి ద్వారా దగ్గరలో ఉన్న ఇతరులకు వ్యాపిస్తుందని, పెంపుడు జంతువుల ద్వారా కూడా మనుషులకు వ్యాపించవచ్చునని, ఈ కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదని, నివారణ ఒక్కటే మార్గం అని కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ వ్యాధి రాకుండా దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలని, వ్యాది లక్షణాలు కలవారు మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, ఇతరులను అపరిచితులను తాకరాదని, జనసంద్రమైన ప్రదేశాలలో సంచరించరాని, చేతులను శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవాలని, పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలని, చలి ప్రదేశాలలో తిరగకుండా ఉండాలని, సాధ్యమైనంతవరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, దగ్గు జలుబు ఛాతీలో నొప్పి మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని, గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి భయ పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని, తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చ‌ని పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
* దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. 2. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాల్ని అడ్డం పెట్టుకోవాలి.
* ఇత‌రులను, అపరిచితులను తాకరాదు. జన సంద్రమైన ప్రాంతాల్లో సంచరించరాదు. చేతులను తరచూ పరిశ్రుభంగా సబ్బునీటితో కడుక్కోవాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. చలి ప్రదేశంలో తిరగకుండా ఉండాలి.
* సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. దగ్గు, జలుబు, ఛాతి, నొప్పి మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే మీ సమీపంలో ఉన్నవైద్యులను సంప్రదించాలి.
* గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* సమతుల ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 

Just In...