Published On: Tue, Mar 24th, 2020

కరోనా వ్యాధి నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలి..

* అధికారుల‌తో వీసీలో సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, నియంత్రణా చర్యలపై ప్రజలలో పూర్తి అవగాహన కలిగించే గురుతరమైన బాధ్యత సమాచార శాఖపై ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి.విజయకుమార్ రెడ్డి చెప్పారు.మంగళవారం విజయవాడ నుండి కరోనా వైరస్‌పై అవగాహన కలిగించే అంశంపై రాష్ట్రంలోని సమాచార శాఖ క్షేత్రస్థాయి అధికారులతో కమీషనర్‌ విజయకుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు (వీసి) ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) పై ప్రజలకు అందించాలన్నారు. ఈ సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తెరిగి ప్రజలకు ఉపయోగపడేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని ఈ వ్యాధి నియంత్రణపై అవగాహన చైతన్యపరిచే కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ప్రతిరోజూ కరోనా వైరసకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయా జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులతో పత్రికా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈసమయంలో పాత్రికేయ సమావేశంలో పాల్గొనే పాత్రికేయులు కూర్చునే దగ్గర సీటింగ్ ఏర్పాట్లు దూరదూరంగా (సోషల్ డిస్టెన్స్) ఉ ండేలా చూసుకోవాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా నిర్వహిస్తున్న 104, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోలు రూం నెంబర్లపై ప్రజలలో విస్తృత అవగాహన కలిగించాలన్నారు. వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత ఒకటే మార్గమనే విషయాన్ని ప్రజలలోకి గట్టిగా తీసుకెళ్ళాలన్నారు. సోషల్ మీడియాలలో పుకార్లు, అభూత కల్పనలు, దురుద్దేశ్యంతో కూడిన వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లయితే కరోనా వైరస్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాధి నిర్ధారణ తదితర అంశాలపై పూర్తి అధికారిక సమాచారంతో తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఉద్యోగులుగానే కాకుండా సాటి మనిషికి సహాయం అందిస్తున్నామనే భావనతో సమాచార శాఖ ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రజలలో భయాందోళన పెరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర, జిల్లా యంత్రాంగం అమలుచేస్తున్న కార్యక్రమాలను మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా తీసుకొని నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయించకుండా నిరోధించేందుకు సంబంధిత అధికారుల ద్వారా రోజూవారీ ధరల పరిస్థితి వివరాలను పత్రికలకు విడుదలచేసి ప్రజలకు సమాచారం అందించాలన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సాంఘిక దూరం పాటించాలని ఇందుకోసం అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదనే విషయాన్ని పదేపదే పత్రికల ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళకు నిర్దేశించిన సమయంలో కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వెళ్ళాలనే విషయంపై అవగాహన పెంచాలన్నారు. ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో కరోనా నియంత్రణా చర్యలు మెరుగ్గా ఉన్నాయని అయినప్పటికీ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో వ్యాధి నివారణపై అవగాహన కలిగించాలన్నారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో కూడిన పెద్ద సైన్యం ఉందని వారి సేవలు బాగా వినియోగించుకోవాలన్నారు. రానున్న పది రోజులు ఎంతో కీలకమని ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని స్థాయిలలో ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కలిగించడంలో సమాచార శాఖ ఉద్యోగులు కృషిచేయాలన్నారు. అనుమానస్పద కేసులను ఐసోలేషన్లో ఉంచడం ప్రజల మంచికోసమనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఈసందర్భంగా జిల్లాలవారీగా కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన ప్రచార కార్యక్రమాల వివరాలను క‌మీష‌న‌ర్ సమీక్షించారు. సమావేశంలో సమాచార శాఖ చీఫ్ ఇంజనీరు ఓ.మదుసూదన, రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టరు టి.కస్తూరిబాయి, ప్రాంతీయ సమాచార ఇంజనీరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Just In...