Published On: Thu, May 10th, 2018

కర్నూలు జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతా

* ఓర్వకల్ విద్యార్థులు ఇక్కడే ఉద్యోగాలు చేయోచ్చు 

* కర్నూలుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాక 

* స్టీల్ ఉత్పత్తికి రాష్ట్రం అనుకూలం 

* శ్రీసిటీతో సమానంగా ఓర్వకల్‌ను టౌన్‌సిటీగా మారుస్తాం

* హేతుబద్దత లేని విభజనతో రాష్ట్రానికి న‌ష్టం 

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు 

సెల్ఐటి న్యూస్‌, కర్నూలు: కర్నూలు జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఓర్వకల్ మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను పరిశ్రమల స్థాపన కోసం నిరంతరం శ్రమించానని ఆ ఫలితమే నేడు ఓర్వకల్లో రూ.3 వేల కోట్లతో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ వారు స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకువచ్చారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 415 ఎకరాల భూమిని మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 1.7 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి రూ.2930 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పరిశ్రమ ప్రారంభమైతే 3200 మందికి మొదటి విడతలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనుకున్న సమయానికన్నా ముందే స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ప్రారంభించాలని పేర్కొన్నారు. మరో రూ.23 వేల కోట్ల పెట్టుబడితో మరిన్ని పరిశ్రమలు వస్తాయని అప్పుడు 28 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఓర్వకల్ రాళ్ల‌తో వుందని, దానిని పూర్తిగా పరిశ్రమలకు అనుకూలంగా మారుస్తామన్నారు. పరిశ్రమలు ప్రారంభమైతే ఓర్వకల్లో చదివే విద్యార్థులు వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్లకుండా ఇక్కడే స్థిరస్థాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. వేరే ప్రాంతాల వారు కూడా ఉద్యోగాల కోసం ఓర్వకలకు వస్తారన్నారు. స్టీల్ ఉత్పత్తికి రాష్ట్రం అనుకూలంగా వుందన్నారు. శ్రీసిటితో సమానంగా ఓర్వకలను పరిశ్రమల సిటీగా మారుస్తామన్నారు. తంగడంచలో 650 ఎకరాల్లో ఐయోవా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మెగా సీడ్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. హేతుబద్దత విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయామన్నారు. కేంద్రం పూర్తి సహకారం అందించి వుంటే మరింత అభివృద్ధి సాధించేవారమన్నారు. మొక్కవోని ధైర్యంతో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసుకుంటూ ముందు కెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడితో మరిన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయని అప్పుడు 80 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిశ్రమ ప్రారంభించడం జరిగిందన్నారు. కర్నూలు-తిరుపతి, హైదరాబాద్-కర్నూలు- బెంగుళూర్ హైవే రోడ్డు ఉన్నందున పారిశ్రామికంగా కర్నూలు మరింత అభివృద్ధి చెందడం కోసమే ఓర్వకల్లో విమానాశ్రయం నిర్మిస్తున్నామని ఈ సంవత్సరం ఆగష్టు లేదా సెప్టెంబర్ మాసాలలో విమానాశ్రయం పనులు పూర్తవుతాయన్నారు. ఓర్వకల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని ముచ్చుమర్రి నుంచి అందిస్తామన్నారు. కొలిమిగుండ్లలో సిమెంటు ఫ్యాక్టరీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైల్వే ట్రాక్ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. ఉద్యాన పంటలకు మరింత అనుకూలమైన వాతావరణం కర్నూలు జిల్లాకు వుందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషివల్లే మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రాభివృద్ధి నిరంతరం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు అధికంగా వున్నాయన్నారు. కర్నూలుకు పూర్వ వైభవం రావాలంటే మరిన్ని పరిశ్రమల వల్లనే సాధ్యమవుతుందని ఇందుకు ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. అవినీతి లేని పాలన అందిస్తున్నందు వల్లనే పరిశ్రమలు అధికంగా వస్తున్నాయన్నారు. ఆత్మగౌరవంతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. ఈ సంద‌ర్భంగా జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ఎండి యస్.కె.గోయాంకాను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఘనంగా సన్మానించారు. వివిధ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, కర్నూలు, నంద్యాల ఎంపిలు బుట్టా రేణుక, ఎస్.పి.వై రెడ్డి, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, శాసనమండలి ఛైర్మెన్ ఎన్.యం.డి ఫరూక్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఎమ్మిగనూర్, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు బివి జయనాగేశ్వర రెడ్డి, మణిగాంధి, ఎస్.వి.మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జిల్లా కలెక్టరు యస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్, ఎపిఐఐసి జియం రఘునాథరెడ్డి, జిల్లా పరిశ్రమల జియం సోమశేఖర్ రెడ్డి, ఆర్డిఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
 

Just In...