Published On: Wed, Nov 14th, 2018

కాఫీ రైతుల ఆదాయం పెంపుదలకు చర్యలు తీసుకోండి

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి, కాఫీ రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డవలప్ మెంట్ కార్పొరేషన్(ఏ.పి.ఎఫ్.డి.సి.) ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. జీసీసీ ద్వారా కొనుగోలు చేసిన కాఫీ గింజలను ప్రాసెసింగ్ చేసి వాటికి అధిక ధరలు వచ్చేలా చూడాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో కాఫీ సాగుపై అటవీశాఖ, జీసీసీ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని మన్య ప్రాంతాల్లో కాఫీ సాగు విస్తీర్ణంపై సీఎస్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షా 68 ఎకరాల్లో కాఫీ సాగవుతోందన్నారు. వాటిలో ఏ.పి.ఎఫ్.డి.సి. పరిధిలోని 30 ఎస్టేట్లలో ఉన్న 10 వేలకు పైగా ఎకరాల్లో కాఫీ సాగవుతోందన్నారు. ఏ.పి.ఎఫ్.డి.సి. పరిధిలో 550 మెట్రిక్ టన్నుల కాఫీ పంట ఉత్పత్తవుతోందన్నారు. అంతర్ పంటగా మిరియాలు కూడా సాగు చేస్తున్నారన్నారు. ఏ.పి.ఎఫ్.డి.సి. పరిధిలో ఏటా 6 లక్షల పనిదినాలు గిరిజనులకు కల్పిస్తున్నామన్నారు. దీనివల్ల రూ.30 నుంచి 40 వేల వరకూ గిరిజనులకు ఆదాయం లభిస్తోందన్నారు. దీనిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, కేవలం ఏ.పి.ఎఫ్.డి.సి. పరిధిలో సాగయ్యే కాఫీ పంటతో పాటు గిరిజనులు సాగు చేసే ఉత్పత్తిని కూడా జీసీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దళారులకు విక్రయించడం వల్ల వారు ఎంతమేర నష్టపోతున్నారో గిరిజనులకు వివరించాలన్నారు. ఇందుకోసం గిరిజన గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవసరమైతే కళాజాతా వంటి కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయాలన్నారు. జీసీసీ కొనుగోలు చేసే కాఫీ గింజలను ప్రాసెసింగ్ చేసి, అధిక ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల గిరిజన రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. అప్పుడే జీసీసీకి కాఫీ పంటను విక్రయించడానికి గిరిజనులు ముందుకొస్తారన్నారు. కేవలం కాఫీ పంటలు కొనుగోలుతోనే సరిపెట్టకుండా గిరిజన గ్రామాల్లో వైద్య శిభిరాలను నిర్వహించి, గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ ఆర్.పి.ఠాకూర్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి డి.వెంకటరమణ, పొలిటకల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఫారెస్టు కన్జర్వేటర్ రిజ్వీ, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ఐజీ శ్రీనివాసులు, ఎస్.పి. రామకృష్ణ, అటవీ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...