Published On: Thu, Oct 3rd, 2019

కావూరి శ్రీధ‌ర్‌కు జాతీయ స్థాయి ఉత్త‌మ ఆచార్య పుర‌స్కారం

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఉప విభాగాధిపతి కావూరి శ్రీధర్‌కు జాతీయ స్థాయి ఉత్తమ ఆచార్య పురస్కారం లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని కానూరు వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ సర్వర్స్ అనే సంస్థ ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐటీ అసోసియేషన్, లయన్స్ ఇంటర్నేషనల్, ఇంపాక్ట్ ఫౌండేషన్ మరియు తక్షశిల ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన నవభారత్ నిర్మాణ్ జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ మరియు జనరల్ ఎడ్యుకేషన్ విద్యాసంస్థలలో అత్యుత్తమ సేవలందించిన 150మంది అధ్యాపకులకు ఈ పురస్కారాలు అందజేసినట్లు ప్రిన్సిపల్ మేకా ర‌మేష్ పేర్కొన్నారు. మూడు దశల్లో జరిగిన ఈ అవార్డు ఎంపిక మొదటి దశలో అధ్యాపకుల గురించి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి న్యాయ నిర్ణేతల కమిటీ మదింపు చేశారు. అనంతరం అధ్యాపకుల దరఖాస్తులను, నిర్వాహకులు పంపిన ప్రశ్నావళికి అధ్యాపకుల సమాధానాలను పరిశీలించి సీనియర్ ఐఏఎస్ అధికారులు, విద్యా సంస్థల అధినేతలు, విశిష్ట అధ్యాపకులు అవార్డు గ్రహీతలను ప్రకటించారు.  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలెక్టర్ గా సేవలందిస్తున్న యువ తెలుగు ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలియజేశారు  గత రెండు దశాబ్దాలుగా పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడిగా, ఉపాధి విభాగం అధికారిగా అత్యుత్తమ సేవలందించిన శ్రీధర్ కు ఈ అవార్డు రావటం తమ కళాశాలకు గర్వకారణమని డైరెక్టర్ వేమూరి బాబురావు అభినందించారు. ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ సాంకేతిక నైపుణ్యాలలో అత్యుత్తమ శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేసిన శ్రీధర్ ఈ అవార్డుకు అన్ని రకాల అర్హుడని డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల కొనియాడారు. అవార్డు అందుకున్న శ్రీధర్‌ను సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వినర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Just In...