Published On: Thu, Dec 6th, 2018

కియాతో ఒప్పందం కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగు

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

* ఏపీ, కియా మధ్య అవగాహన ఒప్పందం

* రవాణా వ్యవస్థలో నూతన మార్పునకు శ్రీకారం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కియా మోటార్స్ సంస్థతో ఒప్పందం కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలోని 1వ బ్లాక్ బయట ప్రాంగ‌ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కియా మోటార్స్ సంస్థకి మధ్య ‘భవిష్యత్ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగస్వామ్యం’పై అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కారులో తొలిసారి ప్రయాణించానని, స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. కారు లోపల ఉంటే ఏసీ గదిలో ఉన్నట్లుందన్నారు. ఈ ఒప్పందంతో ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోని 8వ అతి పెద్ద మోటార్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థలను పరిశీలించి ఏపీలో పూర్తి పర్యావరణ హితమైన వాహన వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు దోహదపడాలని కియా మోటార్స్‌ సంస్థను సీఎం కోరారు. కియా అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం పూర్తిగా మారిపోయిందన్నారు. కియా తొలి కారు జనవరిలోగానీ, ఫిబ్రవరిలో గానీ బయటకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో మొదటి కారు బయటకు రావడం ఓ రికార్డుగా పేర్కొన్నారు. ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, మిగిలిన 10 శాతం ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్ కార్లు దోహదపడతాయన్నారు. పర్యావరణ హిత ప్రజారవాణా వ్యవస్థను అందించడంలో సహకరించాలని ‘కియా’ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరారు. ఏపీని సంతోషదాయక రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు కియా మనకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు. ఏపీకి కియా బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. రానున్న తరం అవసరాలకు ఉపయుక్తమయ్యే ప్రజారవాణా వ్యవస్థను తీసుకురావడంలో పరిశోధనలు, అధ్యయనంలో సహకరించేందుకు కన్సల్టెంటుగా ఉండాలని ఆ సంస్థకు సూచన చేశారు. త్వరలో రాష్ట్రానికి 7,300 మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయని, వాటిని వ్యర్ధ సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 5నగరాలలో వంద విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు చెప్పారు. 400 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ సైకిళ్లు, మూడు చక్రాల వాహనాలు వినియోగంలోకి వస్తాయన్నారు. తక్కువ ఖర్చుతో వీటిని నడవపవచ్చని చెప్పారు. 50 శాతం గ్రీనరీ, ప్రకృతి వ్యవసాయం వంటి వాటి ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. అమరావతిలో సీఆర్డీఏ వీటన్నిటినీ అమలు చేస్తుందని చెప్పారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ప్రముఖ ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. ఏపీకి పెట్టుబడులు పె పెద్దఎత్తున వస్తున్నాయని చెప్పారు. రానున్న కాలంలో సౌర వ్యవస్థతో పనిచేయబోతున్నామని, భవిష్యత్‌లో సౌర విద్యుత్ యూనిట్‌ రూపాయిన్నరకే లభ్యం కావచ్చు, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాతావరణాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 180 దేశాలకు విస్తరించి 33 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కియా మోటార్స్ ఇక్కడ నెలకొల్పిన యూనిట్ అత్యుత్తమంగా రూపొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంద శాతం నైపుణ్యత కలిగిన, నైపుణ్యత లేని కార్మికులు లభిస్తారని చెప్పారు. సులభతర వ్యాపారం, ఉద్యోగితకు అర్హత ఉన్న వారి విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పాలసీని, 2018 ఎలక్రిట్ మొబిలిటీ పాలసీని కూడా రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 14 ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణ హితమైన ఆధునిక రవాణా వ్యవస్థను రూపొందిస్తామని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు.
             కియా మోటార్స్ ఎండీ కూక్యూ షిమ్ మాట్లాడుతూ అనంతపురంలోని తమ ప్లాంట్ నుంచి మొదటి మోడల్ కారు 2019లో బయటకు వస్తుందని చెప్పారు. తమ సంస్థ 15వ ఉత్పత్తి కేంద్రం అనంతపురంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా 3 లక్షల కార్లు తయారవుతాయని, ప్లాంట్ నిర్మాణానికి 1.1 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. తమ సంస్థ పది వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్‌పై దృష్టి పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, అటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నూతన టెక్నాలజీ కియాలో ఒక భాగంగా ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంతో భారత వినియోగదారుల జీవన విధానంలో మార్పు వస్తుంద‌ని పేర్కొన్నారు. ఎంవోయూ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
      

Just In...