Published On: Fri, Feb 7th, 2020

‘కియా’ ఏపీని వీడదు..రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల ప్రవాహమూ ఆగదు

* పరిశ్రమలు,వాణిజ్య,ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

* కియా మోటార్స్ సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ తో మంత్రి భేటీ

* విస్తరించడమే తప్ప..వెళ్లడం లేదని చాటిన ఇరువురి భేటీ

* కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదు: కియా జీఎమ్

* పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస సమావేశాలతో బిజీగా గడిపిన మంత్రి

* ఏపీలో తయారైన ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరును ‘అవెరా’ పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి

*  ఆటో ఎక్స్ పోలో ప్రత్యేకార్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్

* ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యానికి ‘రెనాల్ట్ ఇండియా’ ఆసక్తి

* భవిష్యత్తులో పెట్టుబడులు పెడితే ఏపీలోనేనన్న టాటా మోటార్స్

*  నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నీతి ఆయోగ్ సీఈవో హామీ

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కియా మోటార్స్ ఎక్కడికి వెళ్లదని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహం కూడా ఎవరూ ఆపలేరని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో -2020లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కియా మోటార్స్ సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సన్ – ఊక్ – హ్వాంగ్ మంత్రి మేకపాటిని కలిశారు. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని జనరల్ మేనేజర్ స్పష్టం చేశారు. అంతకు ముందులాగే కలిసిమెలిసి ముందుకు సాగుతామని సన్ – ఊక్ – వాంగ్, మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు. కియా మోటార్స్ ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి, పరిస్థితి లేదని, రాష్ట్రంలో తమ వాణిజ్యాన్ని మరింత స్వేచ్ఛగా విస్తరించేందుకు సమాయత్తమవుతున్నామని ఈ సందర్భంగా మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వాంగ్ వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్ రెండో మోడల్ ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుందని మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని మంత్రి వ్యాఖ్యానించారు. కియాపై బాధ్యతరాహిత్యంతో మాట్లాడిన  వారే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు.  రాష్ట్రం, ప్రజల క్షేమం కోరాల్సిన హోదాలో ఉన్న కొందరు  ఇలా ప్రవర్తించడం తనకు బాధ కలిగించిందని మంత్రి అన్నారు. అనంతరం కియా మోటార్స్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ఇలాంటి అసత్య ప్రచారాలపై ‘కియా’ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతపురంలో ఏర్పాటైన కియా మోటార్స్  ఇండియా సంస్థ ఏపీని వీడేది లేదని కియా సంస్థ ఎండీ పంపిన సందేశాన్ని కుష్బూ గుప్తా మీడియా ముఖంగా చదివి వినిపించారు.
న్యూ ఢిల్లీలో అట్టహాసంగా జరుగుతోన్న ఆటో ఎక్స్ పో -2020 మోటార్ షోలో భాగస్వామ్యమవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్ ను మంత్రి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆటో కాంపొనెంట్ షో 2020లో ఏపీలో తయారై, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లపై రయ్ మని తిరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘అవెరా’ పనితీరును మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. ఏపీ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లడానికి సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. పర్యావరణహిత విద్యుత్ వాహనాలే మానవ మనుగడకు శ్రేయస్కరమని మంత్రి స్పష్టం చేశారు. భారతదేశ వాహన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మళ్లడం శుభపరిణామమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస సమావేశాలతో గౌతమ్ రెడ్డి బిజీగా గడిపారు.ముందుగా ‘రెనాల్ట్ ఇండియా’ ఆటో మొబైల్ సీఈవోతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ  సీఈవో మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యమయ్యేందుకు రెనాల్ట్ ఇండియా సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు మంత్రికి తెలియజేశారు.  అనంతరం ‘గ్రేట్ వాల్ మార్ట్’ సంస్థకు చెందిన డైరెక్టర్లతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుందో మంత్రి వారికి వివరించారు. ఆ తర్వాత మహీంద్ర ఆటో మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. వ్యవసాయంలో కీలకంగా మారిన ట్రాక్టర్ల తయారీలో సంస్థ సరికొత్త ఆలోచనలను మంత్రి అభినందించారు. వ్యవసాయ పరిశ్రమలకు ఊతమిచ్చే అగ్రి ఆటోమొబైల్స్ విషయంలో సంస్థ ఆలోచనలు బాగున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి మెచ్చుకున్నారు. భారత దిగ్గజ ఆటో ఇండస్ట్రీలలో ఒకటైన టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. భవిష్యత్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకుంటామని ప్రతినిధులు మంత్రితో అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.  అనంతరం  నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించే నిధులపై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు గురించి మంత్రి విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థికంగా సహకారంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హామీ ఇచ్చారు. సమావేశాల్లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు.

Just In...