కీచక కానిస్టేబుల్కు దేహశుద్ది…
తాడేపల్లి(గుంటూరు జిల్లా), సెల్ఐటి న్యూస్: పౌరులకు, మహిళకు రక్షణగా నిలవాల్సిన వ్యక్తే ఓ వివాహితను వేధింపులకు గురిచేస్తున్న వైనం వెలుగుచూసింది. మహిళలను వేధిస్తే ఆకతాయిల బెండు తీయాల్సిన ఓ కానిస్టేబుల్ ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. పోలీస్ శాఖకే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన కానిస్టేబుల్కు ఈసందర్భంగా ప్రజలు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. వివరాల ప్రకారం.. కుంచనపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను తీసుకువెళ్తున్న వివాహితను గత కొద్ది రోజులుగా కానిస్టేబుల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. వెంటపడి వివాహిత నివాసానికి వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో వేధింపులు శృతి మించటంతో కుటుంబ సభ్యుల ఎదుట వివాహిత వాపోయింది. దీంతో వివాహిత వెంటపడి వేధిస్తున్న కానిస్టేబుల్కు స్థానికులు దేహశుద్ది చేసి తాడేపల్లి పోలీసులకు అప్పచెప్పి పొలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కీచక కానిస్టేబుల్ రామకృష్ణను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.