Published On: Tue, Aug 20th, 2019

కుల, వివిధ వృత్తుల పరికరాల పంపిణీకి అర్హులైన వారినే ఎంపిక చేయాలి

* రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ఆదేశం

సెల్ఐటి న్యూస్, అమరావతి: కుల, వివిధ వృత్తుల పరికరాల పంపిణీకి అర్హులైన వారినే ఎంపిక చేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ఆదేశించారు. మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తదితర అధికారులతో వెలగపూడి సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాల వారీగా డిమాండ్ ఉండే కొత్త యూనిట్లు గుర్తింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. పథకాల అమలులో వాస్తవ లబ్ధిదారులకు పథకాల వల్ల మేలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్స్ స్థాపనపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. లబ్ధిదారుల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని యూనిట్స్ గ్రౌండింగ్ చేస్తారని, ఈ విషయంపై అటు బ్యాంకర్లతో పాటు లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. సహజమైన విధానంలో చేపట్టే వ్యాపారాలు, పరిస్థితులకు అనుగుణంగా వాటిని అధిగమించే విధానంలో చర్యలు, ఆలోచనలు ఉండాలని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియ కోసం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాలు ఎంపిక చేసే కమిటీ అధికారులకు తెలియచెయ్యడం ముఖ్యమన్నారు. ప్రతి నెలా మొదటి వారంలో ఈడీ , తదితర అధికారుల తో జిల్లా లలో సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో గుర్తించిన యూనిట్స్ కొనుగోలుకు జిల్లా డిపిసి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెలా చేపట్టనున్న సమావేశం ఎజెండా అంశాలు, వాటిపై చర్చించిన అంశాల మీద తదుపరి సమావేశంలో చర్చించాలన్నారు. లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చిన్న, మధ్యతరహా యూనిట్స్ స్థాపనపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ,అనుబంధం రంగాలు, రవాణా రంగం, కంప్యూటర్ విడి పరికరాలు అమ్మకాలు, సర్వీసింగ్ , సెలూన్ లు తదితర ప్రాజెక్టుల విషయంలో అవకాశాలు పై దృష్టి సారించాలన్నారు. బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల్ వలవన్ తో కలిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సమర్పించిన కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా జిల్లాల్లో ఆచరణీయ యూనిట్లపై చర్చ, యూనిట్లు బదిలీ స్థితి, గోదాముల నుంచి మండల , మునిసిపాలిటీల పాయింట్లకు పరికరాలు పంపిణీపై సమీక్షించారు. అలాగే, 10% లబ్ధిదారుల వాటా చెల్లించిన అర్హత కలిగిన లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ, 2014-15 నుండి 2018-19 వరకు వినియోగించిన సబ్సిడీ, నైపుణ్యాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు, డిబిటి (ప్రత్యక్ష ప్రయోజన పథకం) ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి ఆర్థిక సహాయం అమలుపైనా సమావేశంలో చర్చించారు. సమీక్షా సమావేశంలో ఏపీ బీసీ సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ విసి అండ్ ఎండి ఎమ్.రామారావు, బిసి శాఖ సంచాలకులు బి.రామారావు, డెవలప్మెంట్ అధికారి జి.బీమశంకరరావుతో పాటు 13 జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సహాయ కార్యనిర్వాహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...