Published On: Sun, Sep 26th, 2021

కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా ఉప్పాల హారిక ఎన్నిక

* వైస్ ఛైర్ పర్సన్ గా గుదిమళ్ల కృష్ణంరాజు మరియు గరికపాటి శ్రీదేవి ఎన్నిక

* కో ఆప్షన్ పదవులకు ఎన్నికల నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి

మచిలీపట్నం(కృష్ణా జిల్లా), సెల్ఐటి న్యూస్: కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం జడ్ పి హాలులో ఎంతో అటహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఛైర్ పర్సన్ గా గుడ్లవల్లేరు జడ్ పిటిసి ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్లుగా నూజివీడు జడ్ పిటిసి గుదిమళ్ల కృష్ణంరాజు మరియు ఇబ్రహీంపట్నం జడ్ పిటిసి గరికపాటి శ్రీదేవి ఎన్నికయ్యారు. ఛైర్ పర్సన్ ఉప్పాల హారికను కైకలూరు జడ్ పిటిసి కూరెళ్ల బేబి ప్రతిపాదించగా, కోడూరు జడ్ పిటిసి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ బలపర్చారు. వైస్ ఛైర్ పర్సన్ గుదిమళ్ల కృష్ణంరాజును తోట్లవల్లూరు జడ్ పిటిసి జొన్నల రామమోహన రెడ్డి ప్రతిపాదించగా కృత్తి వెన్ను జడ్ పిటిసి మైలా రత్నకుమారి బలపర్చారు. జడ్ పి వైస్ ఛైర్ పర్సన్ – 2 గరికపాటి శ్రీదేవిని ఎ.కొండూరు జడ్ పిటిసి భూక్యా గన్యా ప్రతిపాదించగా, మైలవరం జడ్ పిటిసి సర్సాల తిరుపతిరావు బలపర్చారు. ఈ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రిసైడింగ్ అదికారిగా, ఐఎఎస్ అధికారి మురళీధర్ రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించారు. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ కరీమున్నీసా, శాసన సభ్యులు రైలే అనిల్ కుమార్ , కొక్కిలిగడ్డ రక్షణనిధి, కొలుసు పార్థసారధి, సింహాద్రి రమేష్ బాబు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, మొండితోక జగన్ మోహనరావు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వసంత కృష్ణ ప్రసాద్, ఆర్ టిసి రిజియన్ ఛైర్ పర్సన్ తాతినేని పద్మావతి, పలువురు జడ్ పిటిసిలు ఈ సమావేశంలో పాల్గొని జడ్ పి ఛైర్ పర్సన్ గా ఎన్ని కైన ఉప్పాల హారికను అభినందించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ అందరి సహకారంతో కృష్ణా జిల్లాను రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి తన చాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో నవశకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపి విజయసాయి రెడ్డి, రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య నాని, కొడాలి వెంకటేశ్వరరావు నాని, శాసన మండలి, శాసన సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
తొలుత జడ్ పిటిసిలుగా ఎన్ని కైన 43 మంది సభ్యులు తెలుగు అక్షరమాల క్రమంలో ప్రిసైడింగ్ అదికారి ఒకొక్కరి పేరు పిలువగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు అక్షరక్రమంలో మొదటిగా చాట్రాయి జడ్ పిటిసి సభ్యురాలు అనుష చెలికాని ప్రమాణం చేయగా వరుసలో 5వ పేరు ఉప్పాల హారిక ప్రమాణం చేశారు. చివరిగా మైలవరం జడ్ పిటిసి సభ్యులు సర్సాల తిరుపతిరావు ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ పత్రం సరిగా చదవలేకపోయిన నలుగురు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణపత్రం చదివి వారితో చెప్పించారు. అగిరిపల్లి జడ్ పిటిసి పిన్నిబోయిన వీరబాబు, బంటుమిల్లి జడ్ పిటిసి మల్లి శెట్టి వెంకటరమణ, మొవ్వ జడ్ పిటిసి రాజులపాటి పార్వతి, మైలవరం జడ్ పిటిసి సర్సాల తిరుపతిరావుల చేత ప్రమాణం చేయించారు. శాసనం ద్వారా అనబోయి పొరపాటున శాసన సభ ద్వారా అని ప్రమాణం చేసిన ఎ.కొండూరు జడ్ పిటిసి భూక్యా గన్యా చేత ప్రిసైడింగ్ అధికారి మరల ప్రమాణం చేయించారు.

కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా పరిషత్ లో 2 కో ఆప్షన్ సభ్యుల పదవులకు మొవ్వ మండలానికి చెందిన వేమురి పరిశుద్ద రాజు మరియు గన్నవరం మండలానికి చెందిన మహమ్మద్ గౌస్ పోటీ చేయగా ఉదయం 10 గంటల లోపు ప్రిసైడింగ్ అధికారి నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటల లోగా వీరి నామినేషన్లు పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. మ. 3 గం.కు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్ని కైనట్లు కలెక్టర్ ప్రకటించి ఎన్నిక ధృవ పత్రం అందజేశారు. జడ్ పిటిసి సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం వీరి ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Just In...