Published On: Wed, Mar 13th, 2019

కృష్ణా జిల్లాలో నేడు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌ట‌న‌

* ఏర్పాట్లపై సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ సమీక్ష

* హాజ‌రైన విజ‌య‌వాడ సీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు, జేసీ-2 బాబూరావు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్న నేప‌ధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి లోటు పాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గురువారం సాయంత్రం 4గం.లకు ఉప రాష్ట్రపతి నూజివీడులోని ఐఐఐటిలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవుతారని కావున అక్కడ ఐఐఐటి వారు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. మిగతా ప్రాంతాలలో జిల్లా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రోటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అశోక్‌బాబు వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లను చదివి వినిపించి ఆప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా ఎస్పి సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐఎస్‌డబ్ల్యు ఎస్పి టిఆర్ ప్రసాదరావు, డెరైక్టర్ ఫైర్ సర్వీసెస్ జయరామ్ నాయక్, కృష్ణా జిల్లా జెసి-2 పి.బాబూరావు, డియంఇ డాక్ట‌ర్ కె.బాబ్జి, నూజివీడు సబ్ కలక్టర్ స్వాప్నిల్ పండాకర్, నూజివీడు ఐఐఐటి డైరెక్టర్ ప్రొఫెస‌ర్  డి.సూర్యచంద్రరావు, సమాచారశాఖ జెడి పి.కిరణ్‌కుమార్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
          ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉద‌యం 11.20 గంట‌ల‌కు కోయంబత్తూర్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంట‌లకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో ఆత్కూర్ వద్ద గల స్వర్ణభారతి ట్రస్ట్‌కు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం ఆయన మధ్యాహ్నం 3 గంట‌లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 3.45 గంట‌లకు నూజివీడు ఐఐఐటి క్యాంపస్‌కు చేరుకుంటారు. అనంతరం సా.4 గంట‌ల నుండి 5 గంట‌ల వరకూ అక్కడ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవుతారు. అనతంరం సా.5.15 గంట‌లకు నూజీవీడు ఐఐఐటి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి సా.6 గంట‌లకు ఆత్కూర్ స్వర్ణ భారతి ట్రస్ట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 15వ తేది ఉ.9.30 గం.ల నుండి ఉ.10.45 గం.ల వరకూ స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంత‌రం  ఉద‌యం 11 గంట‌లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.20 గంట‌లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
 

Just In...