Published On: Thu, Jul 12th, 2018

కేంద్రం చర్య దుర్మార్గం..

* రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని గడ్కరీకి చెప్పా 

* త్వరలోనే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం

* తెదేపా రాష్ట్ర‌స్థాయి స‌మావేశంలో పార్టీ శ్రేణుల‌కు చంద్రబాబు దిశానిర్దేశం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విభజన తర్వాత సరైన ప్రణాళిక లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ మరో బిహార్‌ అయ్యేదని, ఆ పరిస్థితి రాకుండా పటిష్ట ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో తెదేపా అధికారం చేపట్టి 1500 రోజులు అయిన సందర్భంగా గురువారం ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జాద‌ర్భార్ హాల్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి స‌ద‌స్సులో ఏడాదిలో ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా పరిటాల రవి సహా 350 మందికి పైగా కార్యకర్తలను కోల్పోయామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు విషయంలో కేంద్రం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేసినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీఆరేనన్నారు. అన్న క్యాంటీన్ల విరాళాలకు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. చెప్పినదానికంటే ఎక్కేవే చేశాం.. ఈ విషయం ప్రజలకు గట్టిగా చెప్పాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టులో 56.34 శాతం పనులు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. పోలవరం డీపీఆర్‌ -1లో ఇంకా రూ.400 కోట్లకు పైగా కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. డీపీఆర్‌ -2 ఇచ్చి ఏడాదైనా కొర్రీలు వేస్తూ.. ఇప్పటికీ ఆమోదం తెలపలేదని చెప్పారు. కొన్ని అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ తనతో అన్నారని సీఎం గుర్తుచేశారు. దిల్లీకి అధికారులను పంపుతాం.. మొత్తం సమాచారం ఇస్తామని అని ఆయనకు స్పష్టం చేశానన్నారు. మరీ అవసరమైతే తానే దిల్లీకి వస్తానని చెప్పాననని, సచివాలయాన్ని కూడా తీసుకొస్తానని చెప్పానని స్పష్టం చేశారు. ఎవరో ఆరోపణలు చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం సరికాదని గడ్కరీకి చెప్పానన్నారు. భాజపా, వైకాపా నేతల మాటలు విని రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చెప్పానని తెలిపారు.
                       రాష్ట్రంలో త్వరలోనే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 50లక్షల మందికి నెలకు రూ.1000 చొప్పున పింఛను ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసేసినా రూ.250 కోట్లతో రేషన్‌ దుకాణాల్లో చక్కెర పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని పనిచేస్తున్నట్టు చెప్పారు. బీమా కింద ప్రమాదాల్లో చనిపోతే రూ.5లక్షలు, సాధారణ మరణమైతే రూ.2లక్షలు ఇస్తున్నామన్నారు. పెళ్లి కానుక కింద ఇవ్వాల్సిన నిధుల్ని పూర్తిగా చెల్లిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల విద్యుత్‌ ఇస్తున్నట్టు తెలిపారు. ఒకేసారి మూడు లక్షల గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించామని, రాబోయే నెలలో అర్బన్‌ హౌసింగ్ కింద 50వేల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విభజన హామీలన్నీ నెరవేర్చామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రం చర్య తననెంతగానో బాధించిందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసి న్యాయం జరిగే దాకా వదిలే ప్రసక్తే లేదన్నారు.
 

Just In...