Published On: Mon, Apr 16th, 2018

కేంద్రం మొండి వైఖ‌రి వీడి ఏపీకి హోదా క‌ల్పించాలి

* ప్ర‌భుత్వ చీఫ్ విప్ ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి

* హోదా కోసం అనంత‌లో పూర్ణ‌కుంభ హోమం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: దేశంలో మోదీ లాంటి కరుడుగట్టిన ప్రధాని ఉండడం వల్ల తెలుగు ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగదని, బిజెపి కూడా ఆయన తీరుతో దేశంలో బలహీనపడడం ఖాయ‌మ‌ని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అనంతపురంలో ఆదివారం ఉద‌యం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్ణకుంభ హోమంలో పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేంతవరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన నల్లబ్యాడ్జీలతో  కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు మాట మార్చారని, మోదీకి మంచిబుద్ది ప్రసాదించాలని హోమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర యూనివర్సిటీలు, కడప ఉక్కుపరిశ్రమ, అనంతలో సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, వంటి 19 అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌కు తెలుగు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో భ‌విష్య‌త్తులో బీజేపీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం తన మొండి వైఖరి మార్చుకొని ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Just In...