Published On: Wed, Dec 5th, 2018

కేంద్ర ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశం

* కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయం కోసం లైజనింగ్

* అధికారులను నియమించుకోవాలని సూచన

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న 13 ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని సచివాలయంలో పి.ఎం.ఓ, రాష్ట్ర ఉన్నతాధిలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ‌ ఆదేశించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ లైన్లు, పెట్రోలియం, గ్యాస్ పైప్‌లైన్లకు సంబంధించిన 13ప్రాజెక్టుల పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ స‌మీక్షించారు. రూ.7255 కోట్ల వ్యయంతో చేపట్టిన మల్లవరం – విజయ్‌పూర్ పెట్రోలియం, గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణలో అడ్డంకులను అధిగమించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని సీఎస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రూ.2677 కోట్లతో చేపట్టిన విజయవాడ– ధర్మపురి హెచ్. పి.సి.ఎల్. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులకు అవసరమైన భూమిని రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైందని కేంద్ర అధికారులకు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జాతీయ రహదారి విస్తరణ, విజయవాడ – గుండుగొలను ప్రాజెక్టుకు అవసరమైన 97 శాతం భూమి సిద్దంగా ఉందని వెంటనే పనులు ప్రారంభించాలని సీఎస్ కేంద్ర అధికారులను కోరారు. విజయవాడ బైపాస్ పనులు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డాయని, వెంటనే డీపీఆర్ సిద్దం చేసి, టెండర్లు పిలవాలని సీఎస్ కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులను కోరారు. తాజాగా డీపీఆర్ తయారుచేసేందుకు వారు అంగీకరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో విస్తరించిన 216 జాతీయ రహదారి విస్తరణ, నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైను పనులు,కడప – బెంగళూరు రైల్వే ప్రాజెక్టు, తిండివనం – నగరి, రాయదుర్గం–కల్యాణదుర్గం, విజయనగరం – సంబల్ పూర్, కొత్తవలస – కోరాపుట్, యలహంక–పెనుగొండ, గుంటూరు – గుంతకల్లు,కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే పనులకు అవసరమైన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు సమావేశమై పనులు పురోగతిపై సమీక్షించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయం కోసం లైజనింగ్ అధికారిని నియమించుకుంటే బాగుంటుందని సీఎస్ కేంద్ర అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లాలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చేపడుతున్న 420 కేవీ లైన్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు.

Just In...