Published On: Wed, Jun 12th, 2019

కొత్త ప్రభుత్వం వచ్చాక తెదేపాపై దాడులు పెరిగాయి

* ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆరోప‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. బుధ‌వారం ఉద‌యం గుంటూరు తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ‘‘రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నార‌ని, శిలాఫలకాలు, స్వాగత ద్వారాలు ధ్వంసం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవటంలేద‌ని, పోలీసులు రక్షణ కల్పించకుండా కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లాలని చెబుతున్నార‌ని తెలిపారు. ఇలాంటి ఘటనలు గుంటూరు, అనంతపురంతో పాటు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయ‌న్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాద‌ని   తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు అధికారంలోకి వచ్చినా.. అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాం తప్ప ఎప్పుడూ ఇలాంటి దాడులు  చేయలేద‌ని తెలిపారు. అధికారాన్ని కక్ష సాధింపు చర్యలకు వాడవద్దని సీఎంను కోరుతున్నా అన్నారు. త‌మ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత త‌న‌పై ఉంద‌న్నారు. త‌న కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశార‌ని తెలిపారు. తాను స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేశాన‌న్నారు. శాసనసభకు విపక్షం రాకపోయినా వారిని రప్పించేందుకు ప్రయత్నించిన‌ట్లు చెప్పారు. శాసన సభాపతిగా హైదరాబాద్‌లోని ఇంటికి మాత్రమే అద్దె తీసుకున్నా అని కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వివరించారు. విలేక‌రుల స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జి.వి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Just In...