Published On: Fri, Mar 15th, 2019

కొర‌డా ఝుళిపిస్తున్న అబ్కారీ క‌మీష‌న‌ర్‌

* 15 రోజుల్లో రూ.కోటిన్న‌ర విలువైన అక్ర‌మ మ‌ధ్యం స్వాధీనం

* అక్ర‌మాలపై పిర్యాధుల‌కు టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌, గోడ ప‌త్రిక‌లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అబ్కారీ శాఖ కొరడా ఝ‌ళిపిస్తోంది. మూస‌ధోర‌ణుల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం సాయంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప‌రుగులు పెడుతోంది. అన‌ధికార, ప‌న్ను చెల్లించ‌ని మ‌ధ్యంతో స‌హా సారాయి, గంజాయిల‌పై నిరంత‌ర నిఘా కొన‌సాగుతోంది.  గ‌డిచిన ప‌దిహేను రోజుల‌లో అబ్కారీ శాఖ చేప‌ట్టిన దాడుల‌లో దాదాపు రూ.1.40 కోట్ల విలువైన 35వేల లీట‌ర్ల మ‌ద్యంను సీజ్ చేసారు. డ్ర‌గ్గ్స్, నార్కోటిక్స్ ప‌రంగా 113 యూనిట్లు సీజ్ చేయ‌గా, వాటి విలువ రూ.17 ల‌క్ష‌లుగా ఉంది. ఈ నేప‌ధ్యంలో మ‌ధ్య నిషేద‌ము, అబ్కారీ శాఖ క‌మీష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎక్సైజ్ కేసుల‌కు సంబంధించి తూర్పుగోదావ‌రిలో గ‌ణ‌నీయంగా కేసులు న‌మోదు అయ్యాయ‌ని అక్క‌డ 8,209 లీట‌ర్ల మ‌ధ్యం స్వాధీనం చేసుకోగా దాని విలువ రూ.28 ల‌క్ష‌లుగా ఉంద‌న్నారు. త‌రువాతి స్ధానం విశాఖ‌ప‌ట్నంది కాగా, అక్క‌డ 6,574 లీట‌ర్ల అక్ర‌మ మ‌ధ్యం స్వాధీనం చేసుకోగా రూ.28 ల‌క్ష‌లుగా అంచ‌నా వేసామ‌న్నారు. నెల్లూరు జిల్లాలో అతి త‌క్కువ‌గా 142 లీట‌ర్ల మ‌ద్యం స్వాధీనం చేసుకోగా, వాటి విలువ రూ.70వేలుగా ఉంద‌న్న మీనా క‌డ‌ప‌లో 150, గుంటూరులో 600, చిత్తూరులో 717, విజ‌య‌న‌గ‌రంలో 1018, ప్ర‌కాశంలో 1343, క‌ర్నూలులో 1660, అనంత‌పురంలో 1760, ప‌శ్చిమ గోదావ‌రిలో 2853, కృష్ణాలో 3916, శ్రీ‌కాకుళంలో 6191 లీట‌ర్ల మ‌ధ్యం స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. కల్తీ, పన్ను చెల్లించని, ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మధ్యం, అనధికార మధ్యం విక్రయాలు (బెల్ట్), నాటు సారా వంటివి ఈ మొత్తంలో చేరి ఉన్నాయ‌ని మీనా పేర్కొన్నారు.  డ్ర‌గ్గ్స్,  నార్కోటిక్స్ కేసులు సైతం విశాఖ‌లోనే న‌మోదు అయ్యాయ‌ని రూ.16 ల‌క్ష‌ల విలువైన 108 యూనిట్ల‌ను స్వాధీనం చేసుకోగా, మ‌రోవైపు రూ.75 వేల విలువైన ఐదు యూనిట్లు చిత్తూరు జిల్లాలో స్వాధీనం చేసుకుని కేసులు న‌మోదు చేసామ‌న్నారు.  అబ్కారీ శాఖకు సంబంధించిన ఏపిర్యాధునైనా 1800-425-4868 నెంబర్‌కు తెలియ చేయవచ్చన్నారు. ల్యాండ్ లైన్ నెంబ‌ర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చామని, 0866-2428333 నెంబర్ ద్వారా కూడా సమాచారాన్ని తీసుకుంటామని తెలిపారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకుని, ఆసమాచారాన్ని సైతం వారికి తెలియ చేస్తామని  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కంట్రోల్ రూమ్ పనులు వేగంగా సాగుతున్నాయని త్వ‌ర‌లో దానిని ప్రారంభిస్తామని వివరించారు. మద్యం ప్రభావానికి లోనై ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోరాదన్న ఎన్నికల కమీషన్ ఆకాంక్షల మేరకు త‌గు స‌మాచారంతో అబ్కారీ శాఖ గోడ పత్రికలను రూపొందించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్దాయి నుండి రాష్ట్ర స్దాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, జనసమర్ధ ప్రదేశాలలో విస్తృత ప్రచారం కలిగించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దఎత్తున బ్యానర్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేయనున్నామని మీనా పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ప‌రంగా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా సాగే ఏ వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌మాచారాన్నైనా త‌మ టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌కు తెలియపరిచిన మరుక్షణం తమ బృందాలు రంగంలోకి దిగేలా చర్యలు తీసుకున్నామని ముఖేష్‌కుమార్ మీనా వివరించారు.

Just In...