Published On: Thu, Jul 9th, 2020

కొల్లు ర‌వీంద్ర అరెస్టు ముమ్మాటికీ కుట్ర‌పూరిత చ‌ర్యే

* విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని

మచిలీపట్నం, సెల్ఐటి న్యూస్‌: సౌమ్యుడైన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ముమ్మాటికీ కుట్రపూరిత చర్య అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) పేర్కొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను మ‌చిలీప‌ట్నంలోని ఆయన నివాసంలో బుధ‌వారం పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని నానీ మీడియాతో మాట్లాడుతూ అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్నారు. నాడు హిట్లర్ యూదులను అణచివేయాలని ఎంత ప్రయత్నించిన సాధ్యం కాలేద‌ని వ్యాఖ్యానించారు. అలాగే ఏ వర్గాన్ని కానీ, ఏ పార్టీని కానీ అక్రమ పద్ధతుల్లో అణచివేయడం మీ వల్ల కాదు అంటూ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద‌హ‌రిస్తూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాలను అక్రమ పద్ధతుల ద్వారా అణచివేయాలని అనుకోవడం అమానుషం అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలంద‌రికీ నిరంత‌రం అండగా ఉంటుంద‌న్నారు. వైసీపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానీలు ప్రతి రోజు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా జగ్గయ్యపేట నుండి హైద‌రాబాద్‌కు తరలిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు న్యాయానికి, ధర్మానికి విధేయులుగా ఉండాలి తప్పించి అధికార పక్షానికి కాదని గ్రహించాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావులను పరామర్శించి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తెదేపా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కె.నాగులమీరా, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర పార్టీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ త‌దిత‌రులు ఎంపీ కేశినేని నాని వెంట ఉన్నారు.

Just In...