Published On: Mon, Jan 11th, 2021

కోడి పందేల‌ నిర్వాహ‌కుల‌పై చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు‌…

* విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కోడి పందేలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చర్యలు తీసుకుంటామ‌ని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు హెచ్చ‌రించారు. న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణంలోకి తీసుకుని కత్తులు కట్టి కోడి పందేలు ఆడేవారు, ఆడించేవారి మీద, కత్తులు కట్టే వారి మీద మరియు బెట్టింగ్‌పై పేకాట, కోతముక్క తదితర జూదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేకంగా అదనపు పోలీసు బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా, ఆనందంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా శాంతియుత వాతావరణంలో చట్ట పరిధిలో జరుపుకునేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంద‌న్నారు. అదే క్రమంలో కోడి పందేలు, పేకాట తదితర జూదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో నిఘాను పెంచి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలు మరియు చట్టాన్ని ఉల్లంఘించి కోడి పందేలు ఆడేవారు/ ఆడించే వారిపై, కోళ్ళకు కత్తులు కట్టి పట్టుబడిన వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడంతో పాటు బైండోవర్ చేయడం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 1వ తేదీ నుండి ఇప్ప‌టివ‌ర‌కు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేకంగా కత్తులు కట్టి కోళ్ళ పందాలు ఆడించేవారు, ఆడేవారు మరియు పాత నేరస్థులు 312 మందిని బైండోవర్ చేసి వారిపై 110(ఇ) సి.ఆర్.పి.సి. క్రింద 153 కేసులు నమోదు చేసి, 2 కోళ్ళకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కోళ్ళ పందేలు ఆడించే/ఆడుతూ పట్టుబడ్డ మొత్తం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, 6 కోళ్ళను, 2 కోళ్ళకు కట్టే కత్తులను మరియు రూ.1,250 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింద‌ని తెలిపారు. అలాగే పేకాట, కోతముక్క తదితర ఆటలు నిర్వహిస్తూ పట్టుబడిన మొత్తం 87 మందిపై 7 కేసులు నమోదు చేసి, వారి వద్ద నుండి రూ.5,69,505 ల‌క్ష‌లు న‌గదు స్వాధీనం చేసుకోవడం జరిగింద‌న్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలకు, అధికారులు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Just In...