Published On: Tue, Sep 17th, 2019

కోడెల ఆత్మహత్య.. కన్నీరుపెట్టిన చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై తెదేపా అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చలించిపోయారు. ఆయన మృతి విషాదకరం అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదన్నారు. డాక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోవడం ఊహించని పరిణామం అన్నారు. ఎంత క్షోభకు గురైతే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారో ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మరణ వార్త చెప్పగానే షాక్‌కు గురయ్యానని, ఆయన ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నానని విషణ్ణవదనంతో మాట్లాడారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడారు. కోడెల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే…
మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. మూడు నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. కోడెల టైగర్‌గా బతికాడని, భయం ఎరుగని వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారని అన్నారు. తెల్లారితే ఏం అవమానం చేస్తారో అని భయపడేంతగా హింసించి.. కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. టీడీపీ కార్యకర్తల హత్యలపై, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేశామన్నారు. కానీ కోడెల ఇలా ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుందని అస్సలు ఊహించలేదని చంద్రబాబు తన బాధను వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాక్షసంగా, అమానవీయంగా ప్రత్యర్థులపై పడుతున్నారని మండిపడ్డారు. కోడెల పోరాటయోధుడని, ఎన్ని సమస్యలు, కేసులు వచ్చినా పోరాడదామని గతంలో తనను కలిసినప్పుడు చెప్పానని అన్నారు. కానీ ప్రభుత్వం చేస్తోన్న అవమానాలను కోడెల భరించలేకపోయారని, విచారణ, దర్యాప్తు పేరుతో వెంటాడి వేధించారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజల క్షేమం కోసం పరితపించేవారు…
కోడెల శివప్రసాద్ నిత్యం ప్రజల క్షేమం కోసం పరితపించేవారని చంద్రబాబు కొనియాడారు. రూపాయికే పేదలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. వైద్య వృత్తిని వదిలి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో చొరవ తీసుకున్న మొదటి వ్యక్తి కోడెల అని చెప్పారు. కోటప్పకొండ అభివృద్ధిలో కోడెల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కోడెల శిప్రసాద్ ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కోడెల మృతికి చంద్రబాబు, టీడీపీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Just In...