Published On: Mon, Sep 16th, 2019

కోడెల లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు

* శాసనసభాపతి పదవికి హుందాతనాన్ని, గౌరవాన్ని తెచ్చారు

* అటువంటి ప్రజానాయకుని మరణం పార్టీకి, ప్రజలకూ తీరని లోటు

* ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల భౌతిక కాయనికి నివాళుల‌ర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్ (ట్రస్ట్ భవన్): కోడెల లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, వారి మరణంతో ఒక మంచి నేతను కోల్పోయామని, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కోడెల శివప్రసాద్ మృతి తీరని లోటని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల భౌతిక కాయనికి నివాళులు అర్పించారు. ఒక వైద్యునిగా, రాజకీయ నాయకునిగా కోడెల ప్రస్థానం విశిష్టమైనదని ఉమా కొనియాడారు. పల్నాటి ప్రాంతంలో డాక్టర్ కోడెలగా ప్రసిద్ధి పొంది తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుతో 1983లో తెదేపాలో చేరారన్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదు సార్లు నరసరావుపేట నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గెలుపొంది నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా పనిచేసి, ఆ పదవికి హుందాతనాన్ని, గౌరవాన్ని తెచ్చారన్నారు. అటువంటి ప్రజానాయకుని మరణం తెదేపాకే కాదు, ప్రజలకూ తీరని లోటుని, కోడెల శివప్రసాద్ మరణానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Just In...