Published On: Mon, Feb 22nd, 2021

కోరిక‌లు గ‌మ్యం చేరాలంటే కృషి, ప‌ట్టుద‌ల‌తోనే సాధ్యం

* పద్మశ్రీ అన్నవరపు రామస్వామికి సన్మానంలో కృష్ణా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: మనిషి కోరికలు గమ్యం చేరాలంటే పట్టుదల, కృషి తప్పకుండా కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ చెప్పారు. ఆదివారం స్థానిక కలెక్టర్ సమావేశ భవనంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ అన్నవరపు రామస్వామి గొప్ప మహనీయుడని, అతి గొప్ప కళాకారుడని కొనియాడారు. ఆయన వయోలిన్ ద్వారా సంగీతంలో రూపొందించి “రఘపతి రాఘవ రాజారాం” అనే గేయం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. తన విద్యను శిష్యులకు అందించేందుకు కనీసం విద్యార్ధుల నుండి ఫీజు కూడా సేకరించని ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, సంగీతం, కళలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయన్నారు. ప్రపంచాన్నే నడిపించే ఇంధనం కేవలం ధనం అవుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈనాటికీ నిరంతరం వయోలిన్ వాయించడంలో సాధన చేస్తున్న నిత్య విద్యార్ధి రామస్వామి అని కలెక్టర్ కొనియాడారు. సన్మానగ్రహీత అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ తనకు జరిగే సన్మానాలు అన్నీ తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకే అర్పితమన్నారు. తాను నిత్య విద్యార్ధినినే అని అంటూ ఇక్కడ ఉన్న విద్యార్ధుల కంటే సీనియర్ విద్యార్ధినని చెప్పారు. తన బాల్యం గురించి వివరిస్తూ 15వ ఏట తన స్వగ్రామం సోమవరప్పాడు వదిలి పారుపల్లి రామకృష్ణయ్య గురుకులానికి వచ్చి చేరానన్నారు. “వారాలు” తింటూ తాను సంగీతం నేర్చుకొన్న‌ట్లు తెలిపారు. కొన్ని రోజులుగా భోజనం చేయని తాను మండు వేసవిలో గాంధీనగర్ వద్ద ఉన్న ఒక మురుగు కాలువ పక్కన పడి వున్న అన్నం మెతుకులను పరమాన్నంగా భావించి భోజనం చేశానని, జీవితంలో పడ్డ కష్టాలను వివరించారు. ఇతరులు తనకు చేసే సన్మానాల కంటే తాను ఇతరులకు చేసే ఉపకారమే ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఇతరులు చేసే సన్మానాలలో జీవం ఉండదని, కాని నేడు జరుగుతున్న కలెక్టర్ సన్మానం మనస్సుతో చేసింద‌ని అభివర్ణించారు.
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మంగలంపల్లి బాలమురళీకృష్ణ, పండిట్ భీమ్‌సేన్ జోషి, పండిట్ జరాజ్ వంటి హిందుస్థాని సంగీత కళాకారులకు వయోలిన్ సహకారం అందించానని గుర్తుచేసుకొన్నారు. 1948 నుండి 86 వరకు ఆల్ ఇండియా రేడియోకు తన సేవలు అందించానని ఆయన చెప్పారు. సమావేశానికి జాయింట్ కలెక్టర్ (ఆసరా) మోహన్‌కుమార్ అధ్యక్షత వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె.మాధవీలత, సంఘ సంస్కర్త డా.అజయ్, సంగీత కళాకారిణి దుర్గాభవాని, పిడి డిఆర్‌డిఎ శ్రీనివాసరావు, యువజన సంక్షేమశాఖాధికారి పిఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

Just In...