Published On: Mon, Apr 22nd, 2019

కోలాహలంగా మహిత వార్షికోత్సవ వేడుకలు

* అద‌ర‌హో అనేలా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు 

* విద్యార్థులే దేశ భవిష్యత్తు: విజయ హాస్పిటల్స్ జీఎం రాఘవేంద్రకుమార్

సెల్ఐటి న్యూస్‌, కృష్ణలంక: బహుమతులు అందుకున్న విద్యార్థుల కేరింతలు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల ఆటపాటలు.. తమ కంటిపాపల ప్రతిభాపాఠవాలను తిలకించేందుకు తరలివచ్చిన తల్లిదండ్రుల ఆనందోత్సాహాలతో.. మహిత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వార్షికోత్సవం కోలాహలంగా జరిగింది. కృష్ణలంక బాలాజీనగర్‌లోని మహిత స్కూల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిత గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏవీ సీతామహాలక్ష్మి ప్రసంగిస్తూ చిన్నారుల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జీఎం బీఆర్ రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న మహిత నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కేరింతలు, తల్లిదండ్రుల కరతాళ ధ్వనులు నడుమ మహిత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వార్షికోత్సవం పండుగలా సాగింది. ఈ కార్యక్రమంలో మహిత సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఏ.ఎం.ఆర్.దాస్, డైరెక్టర్ జె.సుధాకర్ రెడ్డి, కృష్ణలంక క్యాంపస్ ప్రిన్సిపాల్ కె.వరలక్ష్మి, స్కూల్ ప్రిన్సిపాల్ బి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...