Published On: Mon, Jun 24th, 2019

క్రీడలతోనే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి, పేరు ప్రఖ్యాతలు

* క్రీడ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పీవీ సింధును నియ‌మిస్తాం..

* విజ‌య‌వాడ‌లో ఒలింపిక్ ర‌న్‌లో మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించిన ఒలింపిక్‌ డే రన్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్‌, అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర భ‌వ‌నాల శాఖ మంత్రి,  ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో  ఉందని, క్రీడలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా త్వరలో పీవీ సింధును నియమిస్తామని తెలిపారు. క్రీడలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, క్రీడాకారుడిగానే తాను ఉద్యోగం సాధించానని అన్నారు. ఒలింపిక్ డే రన్ ద్వారా క్రీడలపై యువతకు మరింత ఆసక్తిని పెంపొందిస్తామన్నారు. క్రీడల ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి, పేరు ప్రఖ్యాతలు దక్కుతాయన్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ సాధించాలంటే క్రీడలు మనిషికి ఎంతో అవసరమన్నారు. ముఖ్య‌మంత్రి జగన్మోహ‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులు మరింత అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారన్నారు. త‌మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ ఆసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేసిందన్నారు. నూతన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను ఎన్నుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉదయాన్నే వ్యాయామం చేసిన తరువాతే తన దినచర్యను ప్రారంభిస్తారన్నారు. ముఖ్యమంత్రి జగన్ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి ఆయనలో ఉన్న ఫిట్‌నెస్ ఒక కారణమన్నారు. ముఖ్యమంత్రి క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారని, ఆంధ్రప్రదేశ్‌కు పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలను కూడా తప్పనిసరి చేయాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు.
అర్జున అవార్డు గ్రహీత, బాడ్మింటెన్ క్రీడాకారిణి పి.వి సింధు మాట్లాడుతూ 2020 వరల్డ్ ఒలింపిక్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఇటువంటి రన్‌లు మరిన్ని నిర్వహిస్తే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుందన్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావు మాట్లాడుతూ క్రీడాకారులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కువ మంది క్రీడాకారులు ఆటల్లో పాల్గొంటున్నా గోల్స్ నిర్దేశించుకోవడం లేదన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే సరైన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ స్థాయి పోటీలలో ఎపికి పతకాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ విసి అండ్ ఎండీ కె.భాస్కర్, వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Just In...