Published On: Mon, Aug 19th, 2019

క్రీడాకారుల నైపుణ్యం అద్భుతం

* మంత్రి శ్రీ కొడాలి నాని

సెల్ఐటి న్యూస్, గుడివాడ: జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు బల్లి దేవదానం సబ్ జూనియర్ విభాగంలో ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల కర్నూలులో నిర్వహించిన సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు గుడివాడ ఎన్టీ ఆర్ స్టేడియం నందు శిక్షణ తీసుకొన్న క్రీడాకారులు బాలురు ఆరుగురు, బాలికలు ముగ్గురు కృష్ణాజిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి వారి నైపుణ్యతను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. సెప్టెంబర్ 3నుండి 9వరకు ఒడిస్సాలో జరిగే జాతీయ సబ్ జూనియర్ పోటీల్లో దేవానందం పాల్గొంటారని స్టేడియం కమిటీ కార్యదర్శి నర్రా రత్నశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ జాతీయ పోటీలకు ఎంపికైన స్టేడియం క్రీడాకారుడు దేవానందంను స్టేడియం ఆవరణలో మంత్రి నాని పుష్పగుచ్ఛంతో అభినందించారు. జాతీయ క్రీడల్లో రాణించి దేవానందం ఉన్నత స్థాయికి ఎదగాలని, గుడివాడకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు దొప్పలపూడి రవికుమార్, లంక దాసరి ప్రసాదరావు, కోచ్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...