క్వారంటైన్ సెంటర్‌తో ఆక్వా రంగంలో పెను మార్పులు
* మంత్రి మోపిదేవి వెంకటరమణ
విశాఖపట్నం, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆక్వా, మత్స్య శాఖ రంగాలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో రూ.34.76 కోట్ల వ్యయంతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. దేశంలోనే రెండో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటు చేశారన్నారు. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుతో ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకు రావచ్చన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు, పారిశ్రామికంగా కోస్తా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. దేశంలో యాబై శాతం పైగా ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతులవుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో సరైన నిర్ణయాలతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆక్వాతో పాటు మత్స్య సంపద అభివృద్దికి మూడు వేల కోట్లతో మేజర్ పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతందని, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి పరిపాలనకు ఆటంకం కల్గించే దిశగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నరని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బలి పశువు కావద్దని సూచించారు. ఎన్నికల కమిషనర్‌కు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పరిపాలనా సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానం కైవసం చేసుకున్నారని మంత్రి మోపిదేవి గుర్తుచేశారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.