Published On: Sat, May 11th, 2019

క‌ర్నూలులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

* తుఫాన్ వాహ‌నాన్ని ఢీకొన్న ట్రావెల్స్ బ‌స్సు 

* ఘ‌ట‌నా స్థ‌లంలోనే 13 మంది దుర్మ‌ర‌ణం, ఆసుప‌త్రిలో మ‌రో ఇద్ద‌రు మృతి

* మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం

* నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా చోటుచేసుకున్న విషాదం 

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్ (వెల్దుర్తి): కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు శ‌నివారం సాయంత్రం గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో  తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్నవారిలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలోనే 13 మంది మృతిచెందగా.. చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వెల్దుర్తిలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టింది. వాహనంలో 17 నుంచి 20 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. దుర్ఘటనలో 15 మంది మృతిచెందగా.. మిగతా వారు వాహనంలో ఇరుక్కుపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న నలుగురిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతులను తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా వాహనంలో ఉన్నవారంతా మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
                   తుఫాన్ వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న వారంతా నిశ్చితార్థానికి వెళ్లి అనంతపురం వైపు నుంచి గద్వాలలోని తమ సొంత గ్రామానికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారేనని.. సమీప బంధువులైనప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏ గ్రామానికి పెళ్లిచూపులకు వెళ్లారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ విషాదంతో ఎవరూ అక్కడ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఆధార్‌ కార్డుల్లో వున్న సమాచారం ఆధారంగా మృతులంతా రామాపురం గ్రామస్థులుగా పోలీసులు తేల్చారు. వీరంతా కాసేపట్లోనే కర్నూలు దాటాల్సి ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సులో వున్న వారిలో కొందరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయం తెలియాల్సి ఉంది.
ప్ర‌మాద ఘ‌ట‌న‌పై చంద్రబాబు,  కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.
ఉప‌ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప సంతాపం..
కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గరజరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. ప్రమాద ఘటనపై ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మృతులకు వైఎస్ జగన్‌ సంతాపం…
ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతులకు  సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.
 

Just In...