Published On: Thu, Jan 3rd, 2019

క‌ల్తీ ఆహార‌ప‌దార్థాల త‌యారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

* రూ.25 ల‌క్ష‌లు విలువైన క‌ల్తీ ఆహార‌ప‌దార్థాలు, త‌యారీ సామాగ్రి స్వాధీనం

* విజ‌య‌వాడ‌లో వెలుగు చూసిన వైనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: చిన్నపిల్లలు అమితంగా తినే చాక్లెట్లు, జామ్‌లు త‌దిత‌ర ఆహార‌ప‌దార్థాలు కల్తీ చేసి అక్ర‌మ మార్గంలో విక్ర‌యాల‌కు పాల్ప‌డుతున్నార‌నే ప‌క్కా స‌మాచారంతో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ‌వారం దాడులు నిర్వ‌హించారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి జి.రాజీవ్‌కుమార్ తన సిబ్బందితో కలసి విజయవాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిట్టినగర్, కె.ఎల్.రావు నగర్‌లోని రెండంతస్తుల ఇంటి కింద పోర్షన్లో గుడౌన్ ఏర్పాటు చేసుకుని ఎటువంటి అనుమతి లేకుండా అక్రమ మార్గంలో డ‌బ్బు సంపాదించాల‌నే ఉద్దేశంతో చిన్నపిల్లలు తినే ఆహాక పదార్ధాలను తయారు చేస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహ‌కుడు మార్గాల ప్రేమ్‌కుమార్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారివద్ద నుండి సుమారు రూ.25 లక్షలు విలువైన 8 మేకింగ్ మిషన్లు, 3 గ్యాస్ బండలు, 4 ఎయిర్‌కంప్రషర్లు, చిన్నపిల్లలు తినే తినుబండారాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మార్గాల ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సరైన లైసెన్సులు లేకుండా చిన్నపిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించ‌కుండా పాచిపోయిన, అపరిశుభ్రమైన రేగిపళ్లు, ప్రజారోగ్యానికి హాని కలిగించే కెమికల్ రంగులు, జామ్‌ల‌ను చిన్నపిల్లలు తినే తినుబండారాలు త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వాటిని ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలలో వేరు వేరు పేర్లతో ప్యాక్ చేసి విజయవాడ పరిసర ప్రాంతాలలో దుకాణాల‌కు విక్ర‌యిస్తున్నాడు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏసిపి  రాజీవ్‌కుమార్ సిబ్బందితో దాడిచేసి దానికి సంబందించిన య‌జ‌మాని మార్గాల ప్రేమ్ కుమార్‌తో పాటు గుమస్తాగా పని చేస్తున్న కనకరాజు మల్లికార్జున, తెల్లాకుల మనికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...