Published On: Sat, Jul 25th, 2020

ఖండాంతరాల్లో ఖ్యాతి పొందిన ఖండాపు మన్మధరావు!…

* చిన్నతనంలో సరదాగా ప్రారంభించిన కవితల రచన ఖండ, ఖండాతరాల్లో గుర్తింపు తెచ్చింది

* పీబి సిద్ధార్థ అధ్యాప‌కునికి ప్రశంస‌ల వెల్లువ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: చిన్నతనంలో సరదాగా ప్రారంభించిన కవితల రచన ఆ అధ్యాప‌కునికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. తెలుగు భాష విశ్వ భాష‌గా మ‌రోసారి ఖ్యాతికెక్కింది. చదువుకునే రోజుల నుండీ ఉపాధ్యాయులపై అపార గౌరవ భావాన్ని ప్రదర్శించ‌డంతో పాటు కవితలు, చిన్నకధలు వ్రాస్తూ విద్యార్థి నాయకునిగా ఎదిగిన ఖండాపు మన్మథరావు 1994 నుండి విజ‌య‌వాడ‌ మొగ‌ల్రాజ‌పురంలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఆకాశవాణిలో ఉపన్యసించి సుప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ నుంచి మన్ననలు పొందారు. ” తెలుగు వెలుగు ” పత్రికలో చిన్ననాటి ఉపాధ్యాయునిపై వ్యాసం వ్రాసినందుకు ఖండాపు మ‌న్మ‌ధ‌రావును అభినందిస్తూ రూ.1,116 న‌గ‌దు పుర‌స్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. అలాగే అనేక సాహిత్య సభల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన విషయాలు, కవితలు వినిపించారు. 50కి పైన జాతీయ, అంతర్జాతీయ తెలుగు సెమినార్లలో పాల్గొని పత్ర సమర్పన చేసి ఉపన్యసించారు. డాక్ట‌ర్ మేడసాని మోహన్, డాక్ట‌ర్ గరికిపాటి నరసింహారావు, డాక్ట‌ర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మొదలగువారి అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు. సిద్ధార్థ అకాడమీ అనుబంధ సంస్థ, సిద్ధార్థ కళాపీఠం సమన్వయకర్తగా ఉంటూ … అకాడమీ పాలకవర్గ పెద్దల అనుమతితో దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొందిన నృత్య కళాకారులతో, సుప్రసిద్ధ తెలుగు కవుల కవితా గానాలు, ఉపన్యాసాలు , అవధానాలు ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ అంతర్జాల సదస్సులలో వందకు పైగా పత్ర సమర్పణ చేసి చదివి వినిపించి ధృవపత్రాలు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న వివిధ తెలుగు సాహిత్య , సాంస్కృతిక సంస్థలు ఏర్పాటు చేసిన కవితల పోటీలలో పాల్గొని భారత ఉపరాష్ట్రపతి ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి, నెల్సన్ మండేలా, మహాకవి దాశరధి, డాక్ట‌ర్ సి.నా.రె, కాటన్ దొర మొదలగు సుప్రసిద్ధులపై వ్రాసిన కవితలు ప్రశంసా పత్రాలందుకున్నాయి. ఈ సంద‌ర్భంగా ఖండాపు మ‌న్మ‌ధ‌రావును ఉపాధ్యాయుల‌తో పాటు అకాడమీ అధ్యక్ష‌, కార్య‌ద‌ర్శులు నల్లూరు వేంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ జంపాల, తెలుగు శాఖాధిపతి డాక్ట‌ర్ వై.విజయానంద రాజు, కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Just In...