Published On: Wed, Nov 14th, 2018

ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం

* పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

* ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

* వ్యవసాయ శాఖ‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

* మిల్లర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామ‌ని మంత్రుల హామీ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, మిల్లింగ్ లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మిల్లర్ల సంఘం నాయకులు పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సచివాలయంలో మెమోరాండం సమర్పించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్‌తో మిల్లర్లు సమావేశమై, వారి సమస్యలు వివరించారు. మిల్లర్ల సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకూ బియ్యం మిల్లులు వాడే విద్యుత్ 100 హెపీ వరకు ఎల్ టీ గా పరిగణిస్తున్నారని, దీన్ని 200 హెచ్ పీ వరకూ పెంచాలన్న మిల్లర్ల ప్రధాన డిమాండ్ ను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ కు బియ్యం సరఫరాపై మిల్లర్లకు, ప్రభుత్వానికి ఉన్న ఎంవోయూలో ఉన్న కఠిన నిబంధనలు తొలగించాలని మిల్లర్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి సీఎంఆర్ కింద రీ సైక్లింగ్ బియ్యం సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ చెప్పారు.  బియ్యం మిల్లుల నుంచి వచ్చే ఉప ఉత్పత్తులైన తవుడు, ఊక, నూకలపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని, దాన్ని తొలగించాలని మిల్లర్లు కోరారు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉప ఉత్పత్తులపై  జీఎస్టీ లేదని మిల్లర్లు మంత్రి పుల్లారావు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి  హామీ ఇచ్చారు. కేంద్రం అనుసరిస్తోన్న రూ.15 పాలసీ వల్ల తమకు రవాణా ఛార్జీలు రావడం లేదని, దీన్ని రూ 10 పాలసీలోకి మార్చాలని మిల్లర్లు కోరారు. ఏపీలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం చెల్లిస్తోన్న రవాణా చార్జీలు ఒకే విధంగా ఉండేలా చూడాలని మిలర్ల సంఘం కోరింది.  ఈ విషయంపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. కాకినాడ ఓడరేవు నుంచి అక్రమంగా ఎగుమతి అవుతున్న బియ్యం తెలంగాణ జిల్లాల నుంచి వస్తోందని మిల్లర్లు మంత్రి పుల్లారావు దృష్టికి తీసుకు వచ్చారు. అక్రమార్కుల సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి  మిల్లర్లకు హామీ ఇచ్చారు.
    ఖరీఫ్  ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిల్లర్లను సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా  రూ. 1790, బీ గ్రేడ్ ధాన్యం రూ. 1750లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని మంత్రి  కోరారు. మిల్లర్ల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ధాన్యంలో మచ్చ ఎక్కువగా ఉంటోందని కేంద్రంతో మాట్లాడి సడలింపు ఇవ్వాలని మిల్లర్లు కోరగా, మంత్రి సోమిరెడ్డి సానుకూలంగా స్పందించారు. మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బు ఆన్ లైన్ లో చెల్లిస్తున్నారని, మిల్లింగ్, రవాణా ఛార్జీలు కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లించాలన్న మిల్లర్ల డిమాండ్ కు అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు.  బ్యాంకు గ్యారంటీని ఆరు నెలల నుంచి,  4 నెలలకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ హామీ ఇచ్చారు. రైతుల పొలాల వద్దే ట్యాబ్ ద్వారా రైతుల వివరాలు అప్ లోడ్ చేసి ధాన్యం సేకరించే విధానం ఇబ్బందికరంగా ఉందని మిల్లర్లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నా ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభం మయ్యాక వచ్చే సమస్యలు పరిష్కరిస్తామని పౌరసరఫరాల కమిషనర్ రాజశేఖర్ హామీ ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం ద్వారా ధాన్యం దిగుబడులు పది శాతం పెరిగాయని మిల్లర్లు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరిపించడంపై కూడా మిల్లర్ల సంఘం సీఎంను కొనియాడారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని మిల్లర్లు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తామని మిల్లర్లు చెప్పారు.

Just In...