Published On: Thu, May 10th, 2018

గతంలో లబ్ధి పొందిన గిరిజనులకూ కొత్త గూడు

* 2004 ముందు నిర్మించిన అర్బన్ ప్రాంత ఇళ్ల మరమ్మతులకూ ఆర్థిక సాయం

* బహుళ అంతస్తుల్లో మౌలిక సదుపాయల కల్పనకు నిధుల పెంపు 

* రూ.25 వేల నుంచి 50 వేలకు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం

* 13 సంస్థలకు 56 ఎకరాల కేటాయింపు

* మంత్రి నారాయణ వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: 2006కు ముందు అప్పటి ప్రభుత్వాలు అందించిన రాయితీతో ఇళ్లు నిర్మించుకున్న గిరిజనులకూ కొత్త ఇళ్లకు నిధులు కేటాయించాలని కోరుతూ కేబినెట్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో గురువారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం అమరావతిలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 56 ఎకరాలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో 2004కు ముందు హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో చేపట్టి బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో భాగంగా ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.25 వేల నుంచి రూ.50 వేల‌కు పెంచాలని జీవోఎం నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదానికి మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు, కాలువలు, గ్యాస్ పైప్ లైన్లు, ఎలక్ట్రికల్ లైన్లతో పాటు తాగునీటి కల్పన పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఎక్కడయినా కొత్త నగరంగాని, రాజధానిగాని నిర్మాణం చేపట్టినప్పుడు ప్రారంభంలో కొన్ని సంస్థలను స్టార్ట్ ఆప్ కింద తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆ సంస్థల ఏర్పాటు ద్వారా మిగిలిన సంస్థలు, వ్యాపార సముదాయాలు ఆ ప్రాంతానికి వస్తాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబునాయుడు సేవాదృక్పథం కలిగిన జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల స్థాపనకు రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించారన్నారు. ఇలా 65 సంస్థలకు 1,312 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. వాటిలో విట్, ఎస్ఆర్ఎంటి సంస్థలు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. విట్, ఎస్ఆర్ఎంటి, అమృత యూనివర్శిటీకి 100 ఎకరాల చొప్పున కేటాయించగా, మరో 100 ఎకరాల చొప్పున రిజర్వులో ఉంచామన్నారు. ఇండో-యూకే యూనివర్శిటీకి 150 ఎకరాలు అందజేశామన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ కు 50 ఎకరాలు, బిఎస్ఆర్ షెట్టీ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ కు 100 ఎకరాలు ఇచ్చామన్నారు. వాటితో పాటు చిన్న చిన్న సంస్థలైన కేంద్రీయ విద్యాలయం 1,2 కు అయిదెకరాల చొప్పున, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ 30 సెంట్లు, పోస్టల్ డిపార్టుమెంట్ కు 5.5 ఎకరాలు, ఎల్.ఐ.సికి 75 సెంట్లు, ఎస్.బి.ఐ.కి 3.3 ఎకరాలు, ఆంధ్రా బ్యాంకుకు 2.65 ఎకరాలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 1.5 ఎకరాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు 45 సెంట్లు, నాబార్డుకు 4.3 ఎకరాలుకేటాయించామన్నారు. ఇలా 65 సంస్థలకు 1,312 ఎకరాలు ఇచ్చామన్నారు. ఈ భూముల్లో విట్, ఎస్.ఆర్.ఎం.టి. యూనివర్శిటీలు ఇప్పటికే ప్రారంభమయ్యారన్నారు. వాటితో పాటు 7 సంస్థల పనులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఆయా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. పనులు ప్రారంభించని సంస్థలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసిందని మంత్రి నారాయణ తెలిపారు. సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో చిన్నచిన్న వ్యాపార సముదాయాలు వస్తాయన్నారు. దీనివల్ల ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ప్రభుత్వం ఆయా సంస్థలకు భూములు కేటాయిస్తోందన్నారు.
13 సంస్థలకు 56 ఎకరాలు…
అమరావతిలో కొత్తగా ఏర్పాటుకానున్న 13 సంస్థలకు 56 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ కు సిఫార్సు చేస్తూ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుందన్నారు.
భూముల కేటాయింపులు ఇలా…
* నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంటోల్(ఎన్.సి.డి.సి)కి 80 సెంట్లు ఇవ్వడానికి మంత్రివర్గ ఉప సంఘ కమిటీ నిర్ణయించింది.
* ఇండియన్ ఆర్మీకి 4 ఎకరాలు.
* డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీకి 5.43 ఎకరాలు.
* డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ కు 10 ఎకరాలు.
* మన టీవీకి 70 సెంట్లు.
* హడ్కోకు ఎకరా.
* రైల్ టెలీకార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు 60 సెంట్లు.
* చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు 3 ఎకరాలు.
* సీఐఐకు 1.5 ఎకరాలు.
* అమరావతి వెంచర్ హేబిటేషన్ సెంటర్ కు 2.3 ఎకరాలు.
* వ్యక్తిత్త వికాస కేంద్రం (ఆర్ట్ ఆఫ్ లివింగ్)కు 10 ఎకరాలు.
* ఈషా ఫౌండేషన్‌కు 10 ఎకరాలు.
* రామకృష్ణా మిషన్‌కు 5 ఎకరాలు.
గిరిజన ప్రాంతాల్లో కొత్త ఇళ్లకు అనుమతులు…
1993-94తో పాటు 2006కు గిరిజన ప్రాంతాల్లో రూ.6 వేలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, వాటి జీవిత కాలం పదేళ్లు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుడికి ఒకేసారి ఇంటి నిర్మాణానికి అవకాశం ఉందన్నారు. గిరిజనుల ఇళ్ల నిర్మాణాల జీవితకాలం పూర్తికావడంతో, వారికి గ్రామీణ ఇళ్ల నిర్మాణ పథకం కింద కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకే కేబినెట్ కు సిఫార్సు చేసిందన్నారు.
అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల మరమ్మతులకు నిధులు…
గ్రామీణ ప్రాంతాల మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో 2004కు ముందు నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు నిధులు మంజూరుకు మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందని మంత్రి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మరమ్మతులకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నామని, ఆవిధంగానే అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల మరమ్మతులకు నిధులు అందించాలని జీవోఎం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది లెక్కలు తేల్చాలని హౌసింగ్ అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిందన్నారు.
రూ.25 వేల నుంచి రూ.50లకు పెంపు…
పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకూ ఇళ్ల కేటాయింపునకు ప్రభుత్వం బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ బహుళ అంతస్తుల్లో ఒక్కో ఇంటిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.25 వేలను ప్రభుత్వం ఇంతకుముందు కేటాయించిందన్నారు. ఈ మొత్తాన్ని రూ.50 వేలకు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు.

Just In...