Published On: Thu, Dec 6th, 2018

గిన్నిస్ బుక్ ప్ర‌పంచ రికార్డుల్లో విజ‌య‌వాడ విజ‌య‌కేత‌నం

* దంత వైద్య పరీక్షల్లో గిన్నిస్‌ రికార్డు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులో నవ్యాంధ్ర రాజధాని విజయవాడ మరో అడుగు వేసింది. 2016లో దంత వైద్య పరీక్షలు జరిపిన గుజరాత్‌ పేరిట ఉన్న రికార్డును బుధవారం విజయవాడలో జరిగిన దంత వైద్య శిబిరం బద్దలుకొట్టింది. ఒక్క రోజులో 14,978 మందికి దంత వైద్య పరీక్షలు నిర్వహించి గిన్నిస్‌ ప్రపంచ రికార్డుకెక్కిన గుజరాత్‌ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ అధిగమించింది. విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాలలోని ఆడిటోరియంలో డాక్ట‌ర్ శ్రీధర్‌ ఓరల్‌ హెల్త్‌‌ ఫౌండేషన్‌, రెడ్ క్రాస్‌ సొసైటీ కృష్ణా జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెగా దంత వైద్య ప‌రీక్షా శిబిరంలో కేవలం 8 గంటల్లోనే 21,671 మందికి పరీక్షలు చేసి అరుదైన రికార్డును సృష్టించారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నానీ), జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డాక్ట‌ర్ శ్రీధర్‌ రెడ్డిలు గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డాంగ్రేకర్‌ నుంచి రికార్డుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అందుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దంత కళాశాలల నుంచి 400 మంది వైద్యులు ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్య రంగంలో నిపుణులు డాక్ట‌ర్ బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత డాక్ట‌ర్ ఏఎస్‌ నారాయణ, సీకే ధనశేఖర్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
 

Just In...