Published On: Tue, Sep 15th, 2020

గిరిజన పాఠశాలల్లో నాడు-నేడు పనులు ముమ్మరం

* అక్టోబర్ 2నాటికి గిరిజనులకు భూ పంపిణీకి ఏర్పాట్లు

* గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

* ప్రతి ఐటీడీఏలో గిరిజన మ్యూజియం

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: రానున్న అక్టోబర్ 2నాటికి గిరిజనులకు భూ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో గిరిజనులకు భూ పంపిణీ, క్లెయిముల పరిష్కారం, పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రాజెక్టు అధికారులు, డీటీబ్ల్యూవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో జరుగుతున్న నాడు-నేడు  పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని .కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ కింద ఉన్న 474 విద్యాసంస్థల్లో చేపట్టిన పనులు, ఇప్పటివరకు పూర్తైన పనులు, బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో 1,747 పనులను రూ.111.14 కోట్లతో చేపట్టినట్లు కాంతీలాల్ దండే తెలిపారు. చాలా పాఠశాల్లో పనులు పూర్తి కావొచ్చినట్లు అధికారులు వివరించారు. విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలను నాడు-నేడు కింద విద్యుదీకరణ చేయాలని ఆదేశించారు. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రాధమిక పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ స్కూళ్లు/అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  ఐటీడీఏ ప్రాంతాల్లో అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో గిరిజన గ్రామ సచివాలయాల్లో అందిస్తున్న డిజిటల్ సేవలపై చర్చించారు. గిరిజన గ్రామసచివాలయాల్లో ఆధార్, బయోమెట్రిక్, సంక్షేమ పథకాల లబ్ధిదారుల నమోదు వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు డిజిటల్ సేవలు అందని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆన్‌లైన్ సేవల్లో పొరబాట్లు, అంతరాయాల వల్ల సంక్షేమ పథకాలకు దూరమయ్యే గిరిజన కుటుంబం ఉండకూడదని కాతీలాల్ దండే స్పష్టం చేశారు.  గిరిజన ఆవాసాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలనే అంశంపై పూర్తి వివరాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంచాయతీ రాజ్ శాఖకు పంపే అంశంపై పీవోలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ.. అటవీ హక్కుల గుర్తింపు చట్టానికి సంబంధించిన తిరస్కించిన క్లెయిములపై మరోసారి సమీక్ష నిర్వహించాలని.. అక్టోబర్ 5నాటికి దీనిపై కసరత్తు పూర్తి చేసి సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాల వివరాలు, భూమికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపేలా వివరాలు సిద్ధం చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల వంటి మౌలిక సుదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఇకపై గిరిజన గ్రామాల్లో డోలి మోతలు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రంజిత్ బాషా ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభించే అవకాశమున్నందున పాఠశాలల్లో శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి ఐటీడీఏలో గిరిజన మ్యూజియం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రంజిత్ బాషా తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఇ.రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...