Published On: Wed, Jun 26th, 2019

గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ

* రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్న‌బాబు

* అందుబాటులో రైతులకు సరిపడా విత్తనాలు

* 5 ఏళ్ల కోసం విత్తన ప్రణాళిక రూపకల్పన

* విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

* ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి యు.ఎన్.ఓ. బాసట

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర రైతాంగానికి సరిపడా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయనున్నామన్నారు. రాబోయే ఐదేళ్లను దృష్టిలో పెట్టుకుని విత్తన ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మిర్చి, ప్రత్తి వంటి విత్తనాలను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన పంపిణీలో ముందుస్తు ప్రణాళికలు ఎంతో అవసరమని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని, దీనివల్ల విత్తనాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో విత్తన పంపిణీ కష్టాలను అధిగమించామన్నారు. సరైన సమయంలో ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర అందించినప్పుడే అన్నదాత సుఖీభవ అవుతుందని మంత్రి అన్నారు. ఆయిల్ ఫెడ్ కు అప్పటి ప్రభుత్వం రూ.365 కోట్లు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ నిధులు సమీకరించుకోలేక విత్తనాలు కొనుగోలు చేయలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండ్రోజుల్లోనే రైతు సమస్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి, తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారన్నారు. సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ అన్ని విత్తనాలను సిద్ధం చేసిందన్నారు.

2.83 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ…
రాయలసీమ ప్రాంత రైతులకు 4,41,139 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటికే 2.83 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మరో 3.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సమీకరిస్తున్నామన్నారు. ధర ఎంత ఎక్కువయినా నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. రైతులు కోరుకున్న విత్తనాలను అందజేస్తామన్నారు. ఒక్కో రైతుకు 150 కేజీల విత్తనాలను రూ.2,840ల సబ్సిడీపై అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి 50 వేల క్వింటాళ్ల విత్తనాలు రావాల్సి ఉందని, తక్షణమే అందజేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ను కూడా విత్తనాలు సేకరించాలని ఆదేశించామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలన్నది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రైతులకు కోరిన విత్తనాలు…
ఉత్తరాంధ్రలో వరి విత్తనాలకు ఎక్కువ డిమాండ్ ఉందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విజయనగరం జిల్లా రైతాంగానికి 45 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా, ఇప్పటికే 43,500 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామన్నారు. మరో 4 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం రైతులు కోరుతున్న విధంగా 1075 రకానికి చెందిన వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం రైతాంగానికి 64,500 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది 49 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది 15 వేల క్వింటాళ్లు అందనంగా రైతులకు అందజేస్తున్నామన్నారు. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని నిర్ణయించామని, ఈ మేరకు నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

విత్తన ప్రణాళిక రూపకల్పన…
విత్తనాల కోసం రైతులు రోడ్డు మీదుకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తలెత్తకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఎంత నిధులయినా ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో ఎక్కడా విత్తన కొరత రానీయకూడదని సీఎం స్పష్టం చేశారన్నారు. గత ప్రభుత్వం అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా విత్తన సేకరణలో ఇబ్బందులు తలెత్తినా, వాటిని అధిగమించామన్నారు. వచ్చే అయిదేళ్లకు సంబంధించిన విత్తన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా ఏ విత్తనాలు అవసరం, రైతులు కావాల్సిన విత్తనాలు పంపిణీ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని విత్తన ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు…
రాష్ట్రంలో అధిక ధరలకు విత్తనాలు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. మిర్చి, ప్రత్తి వంటి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. రైతులను నష్టపరిచే ఎటువంటి చర్యలనూ ఉపేక్షించబోమని ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించిన విషయం మంత్రి గుర్తు చేశారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల విక్రయాల నిరోధానికి వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారన్నారు.

ప్రకృతి వ్యవసాయానికి యు.ఎన్.ఓ. సాంకేతిక సాయం…
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సాంకేతిక సాయం అందించనుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి అతుల్ బగాయ్ తో మంగళవారం సమావేశమయ్యామన్నారు. ఏపీతో పాటు కర్నాటకలో ప్రకృతి వ్యవసాయం విస్తరణకు 7 మిలియన్ డాలర్ల సాంకేతిక సాయం ఇవ్వడానికి యుఎన్‌ఓ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

Just In...