Published On: Wed, Feb 13th, 2019

గుజరాత్ రాజకీయాలు దేశానికే ప్రమాదం

* చదువురాని ప్రధానితో సమస్య

* మోడీ ఒత్తిడితోనే ఆర్బీఐ గవర్నర్ రాజీనామా

* దేశ హితం కోరేవారు ఏకం కావాలి

* ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు

* జంతర్ మంతర్ వద్ద కేజ్రీవాల్ ధర్నాకు సంఘీభావం

సెల్ఐటి న్యూస్‌, న్యూ డిల్లీ: గుజరాత్ మోడల్ రాజకీయాలు దేశానికే ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో– దేశ్ బచావో ధర్నాకు స్వయంగా చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని కావడమే సమస్య అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఒత్తిడితోనే ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని చంద్రబాబు ఆరోపించారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనకున్న పరిమిత వనరులతోనే ఢిల్లీ సమాజానికి ఎంతో చేశారన్నారు. ఇతర రాష్ట్రాల్లాగా కేజ్రీవాల్ కూ పూర్తి స్థాయిలో అధికారం ఉంటే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు. ప్రధాని మోడీతో పాటు అమిషాలు అత్యంత ప్రమాదకర వ్యక్తులని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న చంద్రబాబు దేశాన్ని రక్షించుకోవాడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మోడీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ కు దేశం మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలంటే ఒకరిపై ఆధారపడే వారు కాదని చెప్పిన ఆయన తమకూ హక్కులు, అధికారాలూ ఉన్నాయని పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే కేంద్ర సంస్థలతో మోడీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిబిఐ, ఐటి, ఈడీలు కలిపి 28 సార్లు దాడులు చేశారని, ఇవ్వన్ని ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసుకునే చేసినవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యవహారాలను తాము సహించబోమని పోరాటంతో ఎదుర్కొంటామన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. దేశ హితం కోసం ఆలోచించేవారందరూ తమకు మద్ధతు తెలపాలని చంద్రబాబు అన్నారు. బిజెపి, ఎన్డీఏ వర్గాలపై కేంద్ర సంస్థలు ఎందుకు దాడులు జరగలేదని వారంతా నిజాయితీపరులా అంటూ ప్రశ్నించారు. బిజెపి, ఎన్టీఏ ఒక వర్గంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రతిపక్షాలు ఒకవర్గంగా దేశం మొత్తం విడిపోయిందన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో లాభపడింది ప్రధాన మోడీ ఒక్కరేనని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే మోడీ మాజీ అవుతారని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘన విజయం సాధిస్తారని చంద్రబాబు జోస్యం చెప్పారు. రాజ్యంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రధానిని ప్రజలే ఇంటికి పంపుతారన్నారు.
ఆర్థిక రంగం కుదేలు…రైతుల ఆత్మహత్యలు…
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశ ఆర్థిక రంగం తీవ్రంగా నష్టపోయి కుదేలైంద‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలూ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస న్యాయ సూత్రాలు తెలియని ప్రధాని పరిపాలనలో సహకార వ్యవస్థ ఎక్కడుందని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్‌ను అడ్డుకున్నారని మండిపడ్డారు. దేశంలోని వ్యవస్థల్ని రక్షించుకోవాలంటే అందరూ కలిసి పోరాడాలన్నారు. అందరి మద్ధతు తమకు కావాలన్నారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియాం అంటూ స్లోగన్లు ఇప్పిస్తూ ధర్నాలో పాల్గొన్న ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతల్లోనూ చంద్రబాబు హుషారు నింపారు. కార్యక్రమంలో మమతా బెనర్జీ, ఫరూక్ అబ్ధుల్లా, ఆనంద్ శర్మ, కనిమొళి, శరద్ పవార్, రాంగోపాల్ యాదవ్‌తో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు.
  

Just In...