Published On: Wed, Jun 13th, 2018

గుట్కాలు సరఫరా, విక్రయ ముఠా గుట్టు రట్టు

* 10 మంది నిందితులు అరెస్టు 

* రూ.3 లక్షల విలువైన సరకు స్వాధీనం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గుట్కాలను సరఫరా చేయ‌డంతో పాటు వాటిని ర‌హ‌స్యంగా విక్రయిస్తున్న ముఠాల గుట్టును అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నవాబ్‌జాన్‌ వెల్లడించారు. ఈ స‌ద‌ర్భంగా మంగళవారం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో గుట్కా సరఫరా, విక్రయ ముఠాల వివరాలను ఆయ‌న వివరించారు. ఇటీవల విజయవాడ పోలీసులు గుంటూరు జిల్లా వెంకటాయపాలెం, పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో దాడులు చేసి భారీగా గుట్కా తయారీకి వినియోగించే ముడిసరకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పలువురు సరఫరాదారులు, విక్రయదారుల వివరాలను గుర్తించారు. దీనిలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. అజిత్‌సింగ్‌నగర్‌ పైపులరోడ్డులోని ఒక బార్‌ సమీపంలోని కిళ్లీ షాపులో గుట్కా నిల్వ ఉన్నట్లు సమాచారం రావటంతో అక్క‌డి పోలీసులు దాడులు చేశారు. గుట్కా, ఖైనీలను విక్రయించే బొల్లేపల్లి నరసింహారావును పట్టుకున్నారు. అదే సమయంలో అక్కడకు గుట్కా సరఫరా చేసేందుకు వచ్చిన షేక్‌ మస్తాన్‌వలీ, డోగిపర్తి శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు ముత్యాలంపాడులోని మరో కిళ్లీ దుకాణంపై దాడులు చేసి యజమాని దేవకి మల్లేశ్వరరావు, గుట్కా కొనుగోలు చేసేందుకు వచ్చిన మహంకాళి అరుణ, వేల్పుల కుమార్‌లతో పాటు గుట్కాలు సరఫరా చేస్తున్న కొణిజేటి హేమంత్‌కుమార్‌ను పట్టుకున్నారు. అనంతరం నందమూరినగర్‌ సాయిబాబా గుడి వద్ద ఉన్న మరో కిళ్లీ దుకాణంపై దాడులు చేసి కఠారి ఏడుకొండలు, వరకాల వెంకటేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి నుంచి రూ.3లక్షల విలువైన గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో గుట్కాలను సరఫరా చేసే నంబూరి శివనాగేశ్వరరావు అనే వ్యక్తి కోసం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. పైపులరోడ్డులోని కిళ్లీ దుకాణం వద్ద తనిఖీలు జరుగుతుండగా నంబూరి శివనాగేశ్వరరావు అక్కడ నుంచి త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు గాలిస్తుండగా ప్రకాశం బ్యారేజీ వద్ద తారసపడ్డాడు. కృష్ణా నదిలోకి దూకగా అక్కడే విధినిర్వహణలో ఉన్న వన్‌టౌన్‌ పోలీసులు రక్షించి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. గుట్కాలు విక్రయించే ముఠా గుట్టురట్టు చేసిన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను, కృష్ణానదిలో దూకిన శివనాగేశ్వరరావును రక్షించిన వన్‌టౌన్‌ పోలీసులను పోలీస్‌ కమిషనర్ డి.గౌతం సవాంగ్‌ అభినందించారు.
 

Just In...