Published On: Tue, Sep 17th, 2019

గుడివాడ పట్టణ పరిధిలోని అన్నివార్డుల్లో మెరుగైన పారిశుద్ద్య కార్యక్రమాలు

* జాయింట్ కలెక్టరు -2, గుడివాడ పురపాలక సంఘ ప్రత్యేకాధికారి మోహన్‌కుమార్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, గుడివాడ: గుడివాడ పట్టణ పరిధిలోని అన్నివార్డుల్లో మెరుగైన పారిశుద్ద్య కార్యక్రమాలను నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను పురపాలక సంఘ అధికారులు సిద్దం చేయడం జరిగిందని జాయింట్ కలెక్టరు -2, గుడివాడ పురపాలక సంఘ ప్రత్యేకాధికారి మోహన్‌కుమార్ అన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌కుమార్ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో పారిశుద్య పనులను వేగవంతం చేసేందుకు మున్సిపల్ కమీషనర్, సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని ఎక్కడా రోడ్డు మీద చెత్త, మురుగునీరు నిలువ లేకుండా పురపాలక సంఘం లోని క్లీనింగ్ మిషన్లుద్వారా ఎప్పటికప్పుడు శుభ్రపరచే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శానిటేషన్ పై వచ్చిన అర్జీలను పరిశీలించి పట్టణంలోని ఆయా వార్డులో పర్యటించి శానిటేషన్ మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిని సారించడం జరుగుతుందన్నారు. గుడివాడ పట్టణంలో సోమవారం జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ నేతృత్వంలో నిర్వహించిన ప్రత్యేక స్పందనా కార్యక్రమానికి ప్రజల నుండి 410 వినతి పత్రాలను స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు ప్రజా సమస్యల పై వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబందిత శాఖలకు పంపించడం జరిగిందన్నారు. వారు అర్జీదారుని సమస్యపై సక్రమంగా విచారణ జరిపి సంతృప్తి కరమైన సమాదానాన్ని అర్జీదారునికి తెలియజేసే విధంగా చర్యలు చేపడతారన్నారు. ఇప్పటికే వార్డు, గ్రామాల్లో గ్రామ వాలెంటీర్లు ఇంటింటికీ తిరిగి రేషన్ కార్డు, నివేశన స్థలాలు, పెన్షన్ సంబందించిన వివరాలను ఆన్ లైన్ జాబితాల్లో నమోదు చేసారన్నారు. ఇంకనూ స్పందనలో రేషన్ కార్డు, నివేశన స్థలాలు, పెన్షన్ వచ్చిన దరఖాస్తులను మరో సారి పరిశీలన నిమిత్తం వాలెంటీర్లకు అందజేయడం జరుగుతుందని వారు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అర్హులైన వారి అందరినీ జాబితాల్లో చేర్చడం జరుగుతుందన్నారు. గుడివాడ మున్సిపల్ పరిధిలో ఆనుకొని ఉన్నగ్రామాలను పురపాలకసంఘంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాధనలు సిద్దం చేస్తుందని, ఆయా గ్రామాలకు సంబంధించి రెవెన్యూ సర్వేనెంబర్లు పక్కాగా ఉండేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ఆర్డీవో జి.వి.సత్యవాణి, మున్సిపల్ కమీషనర్ సంపత్‌కుమార్, అసిస్టెంట్ కమీషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Just In...