Published On: Sat, Nov 2nd, 2019

గొప్ప ఛారిత్రక సంస్కృతి, వారసత్యం కలిగిన రాష్ట్రం ఏపి

* ఇక్క‌డ గవర్నరుగా ఉన్నందుకు గర్వపడుతున్నా

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: గొప్ప చారిత్రక సంస్కృతి, వారసత్వం కలిగిన రాష్ట్రానికి గవర్నరుగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్న‌ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. న‌వంబ‌రు 1న శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌ రెడ్డితో కలిసి గవర్నరు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మాగాంధి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు గవర్నరు, ముఖ్యమంత్రిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రులు ఒక అద్భుతమైన గతాన్ని కలిగి ఉన్నారని ఈ రాష్ట్రం ఎందరో నిబద్ధత కలిగిన నాయకులను దేశానికి అందించిందన్నారు. అటువంటి వారిత్రాత్మకమైన “ వితారేయ బ్రాహ్మణంలో ” ఆంధ్రుల గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. శాతవాహనులతో ప్రారంభించి ఇక్ష్యాకులు, పల్లవులు, రాణుక్యులతో సహా వివిధ ఆంధ్ర రాజవంశాలు ప్రముఖ పాత్రను పోషించాయన్నారు. ఆంధ్రుల చరిత్రలో క్రీస్తుశకం 624 నుండి 1323 వరకూ ఏడు శతాబ్దాలుపాటు ఎంతో ముఖ్యమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయన్నారు. స్వాతంత్య పోరాటంలో అహింస , సహాయ నిరాకరణ , శాసన ఉల్లంఘన ఆలంబనగా దేశవిముక్తి ధ్యేయంగా బ్రిటీష్ పాలకులను తరిమికొట్టాలన్న మహాత్మా గాంధి ఇచ్చిన పిలుపున‌కు ఆంధ్రా ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారన్నారు. అటువంటి రాష్ట్రానికి గవర్నరుగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు . ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అత్యున్నతమైనదన్నారు. విజయవాడ నగరానికి ఒక విశిష్టత ఉందని ఇక్కడి నుండే భారత దేశానికి త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లా వాసి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో లోతైన అవగాహన ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం, సంపూర్ణ నిబద్దత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనలతో నూతన రాపాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మిస్తారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతున్న ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగడం ముదావహం అన్నారు.
రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం, దేశం కోసం ఎందరో ఆత్మర్పణ చేసుకున్నారన్నారు. అమ‌రజీవి పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాలు కోసం ప్రాణత్యాగం చేసారన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు . ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. తెలుగుతల్లికి, తెలుగు నేలకు, తెలుగువారందరికీ వందనాలు పలుకుతూ కార్యక్రమానికి నాంది పలుకుతున్నామన్నారు. మన ఛారిత్రక, సాంస్కృతిక వారసత్యాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దగాపడిన రాష్ట్రంగా పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎక్కడా ధైర్యం కోల్పోకుండా, వెన్ను తిప్పకుండా అభివృద్దే మార్గంగా ఎంచుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక వ్యవస్థల పునఃనిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని నిర్మూలించగలిగినప్పుడే ఒక జాతి పైకి ఎరుగుతుందన్నారు. ప్రజల అవసరాలు, వారి తర్వాతి తరం అభివృద్ధికి నవరత్నాలతో నూతన ఆవిష్కరణలు చేపట్టామన్నారు . విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో పెనుమార్పులు తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు తర్వాత మంచిరోజులు ఉంటాయనే భరోసాతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే మన పెద్దలు నేర్పిన స్ఫూర్తి అని ఆయన అభివర్ణించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, రాష్ట్రం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసారని వారి త్యాగాలను, వెలుగులను గుర్తు చేసుకుంటూ వారి వారసులకు చిరుసత్కారం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి , కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచార్య యంజి రంగా, దామోదరం సంజీవయ్య, గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి త్యాగధనుల త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి స్పూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు . అటువంటి మహానుభావుల త్యాగాలను ఎ ప్పటికీ మరువు కూడదన్నారు.
తాను చెప్పిన మాట ప్రకారం నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ఎంతోమంది మహానుభావులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పునాదులు వేసారని వారి మార్గదర్శకంలో రాష్ట్రాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా మ‌హానుభావుల త్యాగాలను మ‌రువకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనందరం కలిసి అడుగులు వేద్దామని పిలుపునిస్తూ అందుకోసం మీ సహకారాన్ని అందించాలని కోరారు .
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోలేక పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం కోసం, దేశ స్వాతంత్యంకోసం పోరాడిన పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, కన్నెగంటి హనుమంతరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు , ఆచార్య యంజి రంగా, దామోదరం సంజీవయ్య వారి కుటుంబ సభ్యులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్, సియం వై.యస్.జగన్మోహన్ రెడ్డిలు సన్మానించారు. అనురజీవి పొట్టి శ్రీరాములు మనమరాలు ప్రొఫెసర్ డాక్ట‌ర్ రేవతి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన చారి వారసులను పిలిచి సన్మానించడం సంతోషంగా ఉందని అందుకు సియం జగన్మోహన రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని ), కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ప్రభుత్వ సలహాదారులు తలశిల రఘురామ్, సజ్జల రాచుకృష్ణారెడ్డి, మహిళా కమిషన్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డిజిపి గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపల్ సెక్రటరి టూరిజం అండ్ కల్చర్ కె.ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్‌ మాధవిలత, మున్సిపల్ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, శిల్పారామం జైరాజ్, సాంస్కృతిక శాఖ సిఇఓ ఏ.లక్ష్మీకుమారి, విజ‌య‌వాడ సీపి సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఐఅండ్ పిఆర్ కమిషనరు విజయకుమార్ రెడ్డి , పలువురు ఐఏయస్, ఐపియస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
       

Just In...