Published On: Thu, Jun 25th, 2020

గొప్ప మార్పుతో 13 నెలల పాలన కొనసాగింది…

* గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి

* ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకం ప్రారంభోత్స‌వంలో సీఎం జగన్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగిందని, ఎక్కడా వివక్షకు తావునివ్వలేదని, అవినీతికి ఏ మాత్రం తావు లేని విధంగా పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు. తమకు ఓటు వేయకపోయినా.. అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డామని ఆయన స్పష్టం చేశారు. పథకాలు, కార్యక్రమాల అమలులో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదన్నారు. దాదాపు 23 లక్షల కాపు కులస్తులకు ఈ 13 నెలల్లో వివిధ పథకాల కింద రూ.4770 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. వైయస్సార్‌ కాపునేస్తం పథకంలో ఇంకా రాని వారు ఉంటే ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పథకం అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారని, అందులో తమ పేరు లేకపోతే, పథకానికి అర్హులైతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఇవాళ ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న నిరుపేదలైన మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఈ పథకంలో ఆర్థిక సహాయం చేస్తున్నారు. అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల సహాయం చేస్తారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కాపు కులాలకు వివిధ రూపాల్లో ఏటా సగటున రూ.400 కోట్లు కూడా ఇవ్వకపోగా, ఈ ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాదిలోనే కాపు కులాల అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు వివిధ పథకాల ద్వారా దాదాపు 23 లక్షల మందికి రూ.4770 కోట్ల లబ్ధి చేకూర్చింది.

13 నెలల కాలంలో:
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అందరికీ మేలు చేయగలిగామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ఈ 13 నెలల కాలంలో పలు పథకాల కింద 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశామని ఆయన గుర్తు చేశారు. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగిందని పేర్కొన్నారు.
వివక్ష, అవినీతికి తావు లేదు:
ఎక్కడా వివక్షకు తావునివ్వలేదని, తమకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డామని సీఎం చెప్పారు. అదే విధంగా అవినీతికి తావు లేకుండా పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. అలాగే కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదని చెప్పారు.
కాపు కులస్తులకు..:
ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అంటూ సీఎం ఆ వివరాలు వెల్లడించారు.
‘అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర, చేదోడు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, చేయూత, కాపు నేస్తం వంటి అనేక పథకాల ద్వారా దాదాపు 23 లక్షల మందికి అక్షరాలా రూ.4770 కోట్లు లబ్ధి చేకూర్చాము. ఇప్పుడు కూడా బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించబోతున్నాము. ఆ నగదు పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నాం’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

అర్హులెవరైనా మిగిలిపోతే?:
వైయస్సార్‌ కాపు నేస్తం పథకంలో ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం తమదన్న సీఎం , అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారని గుర్తు చేశారు.
వచ్చే నెల ఇదే రోజున:
‘పథకం అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పాలనలో తేడా చూడండి:
గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడాలన్న సీఎం, గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడాలని కోరారు.
‘ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.1874 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
చివరగా,
దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి చేయాలని ఆశిస్తున్నానంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత జిల్లాల నుంచి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఏపీ కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

వైయస్సార్‌ కాపు నేస్తం. పథకం–అర్హతలు:
– కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు.
– ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
– అదే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.
– ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు.
– ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు.
– ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు.
పారదర్శకంగా ఎంపిక:
పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీల నిర్వహణ. ఈ ప్రక్రియల ద్వారా ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకం లబ్ధిదారులను ఎంపిక చేశారు.

మొత్తం ఎందరు?:
2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా, వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున మొత్తం రూ.353.81 కోట్లు జమ చేశారు.
ఏయే జిల్లాలో ఎంత మంది?
ఈ ఏడాది ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది లబ్ధిదారులు ఉండగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3726 మంది మాత్రమే ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 46,856, కృష్ణా జిల్లాలో 28,363, గుంటూరు జిల్లాలో 22,538, విశాఖ జిల్లాలో 14,917, చిత్తూరు జిల్లాలో 8400, ప్రకాశం జిల్లాలో 7885, వైయస్సార్‌ కడప జిల్లాలో 7395, అనంతపురం జిల్లాలో 7085, శ్రీకాకుళం జిల్లాలో 4239, నెల్లూరు జిల్లాలో 4183, కర్నూలు జిల్లాలో 3925 మంది లబ్ధిదారులు ఉన్నారు.

   

Just In...