Published On: Thu, Mar 14th, 2019

గ్రామాల్లో పటిష్టంగా నీటి భద్రత ప్రణాళికల అమలుకు కృషి

* ఏపి డ్రింకింగ్ వాటర్ కార్పోరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: గ్రామీణ నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఇంజినీర్లకు ఇచ్చే శిక్షణ ఉపయోగపడుతుందని ఏపి డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు డాక్ట‌ర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. గురువారం విజ‌య‌వాడ‌లోని ఓ హోటల్లో నీటి భద్రత ప్రణాళికలు (వాటర్ సేఫ్టి ప్లాన్స్)పై ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, వాటర్ రిసోర్సెస్ డవలప్‌మెంట్ డివిజన్, యునెసెఫ్ల సహకారంతో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో నారాయణ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో ఇస్కీ ఆధ్వర్యంలో ఏఇలు, డీఈలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు వాటర్ సెన్సిటైజేషన్ పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణతో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు నీటి భద్రత ప్రణాళికలు అమలుకు ఇస్కీ, యునెసెప్‌లు తమ సహకారాన్ని అందిస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సురక్షితమైన నీటిని అందించడానికి తగిన లక్ష్యాలు నిర్దేశించేందుకు ఏపి డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ కృషి చేస్తుంద‌న్నారు. వాటర్ రిసోర్సెస్ డవలప్‌మెంట్ డివిజన్ సలహాదారు ఎం.రామ్మెహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు స్వ‌చ్ఛ‌మైన త్రాగునీటిని అందించేందుకు ఏపి డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించేందుకు యునేసెఫ్, ఇస్కీలు సహకారంతో వర్కుషాపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ సేఫ్టీ ప్లాన్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్కి, యునే సెఫ్లతో తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతుందన్నారు. గ్రామీణ నీటిపారుదల సంస్థ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనడం కార‌ణంగా నీటిసరఫరాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళుకువలు మరింత సమర్థంగా అమలుకు వీలు ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటలూ, 365 రోజులపాటు ఎక్కువ నీటిని అందిస్తున్న‌ప్ప‌టికీ ఆ నీరులో నాణ్య‌త ప్ర‌మాణాలు ఉండడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో దీనిని ఏవిధంగా యాక్టివ్ చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిసరఫరాపై తగిన చర్యలు సకాలంలో తీసుకుంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో యునెసెఫ్ ప్రతినిధి మనీష్ వసూజా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అమలు చేసే సురక్షిత త్రాగునీటి పధకాలకు యునే సెఫ్ సాంకేతిక సహకారం అందిస్తుందన్నారు. ఏపీలో మొదటి సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అనంతరం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గ్రామాలలో కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వ‌ర్క్‌షాప్ ఉద్దేశం క్యాచ్‌మెంట్ ఏరియాలో నీటిని ప్రజలకు సకాలంలో ఏవిధ మైన కలుషితం కాని రీతిలో అందించేందుకు ఏవిధంగా కృషి చేయాలనే విషయంపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వర్క్‌షాపులో పాల్గొన్న ఇంజినీరింగ్ అధికారులకు నీటిభద్రతపై వివరించారు. కార్య‌క్ర‌మంలో ఆర్‌డబ్ల్యుయస్ అండ్ యస్, సిఈలు కృష్ణారెడ్డి, రాజేశ్వరరావు, యునేసెఫ్ వాష్ వాటర్ క్వాలిటీ కన్సల్టెంట్ సైతీరాయ్ తదితరులు పాల్గొన్నారు.
 

Just In...