Published On: Wed, May 22nd, 2019

గ్రూప్‌-3 పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్‌: గ్రూప్‌-3 (పంచాయతీ కార్యదర్శి) అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎంపికలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఓ అవకాశాన్ని కల్పించింది. గత నెల 21వ తేదీన దీనికి సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరిగింది. అభ్యర్థి తాను చదువుకున్న జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాస్తే స్థానికేతరులుగా కమిషన్‌ గుర్తిస్తోంది. ఈ విషయం తెలియక కొంతమంది అభ్యర్థులు ఇతర జిల్లాల్లో కేంద్రాలను ఎంపిక చేసుకుని పరీక్ష రాశారు. ఈ పరిస్థితుల్లో నిబంధనలు తెలియక వేరే జిల్లాల్లో పరీక్ష రాశామని, సొంత జిల్లా అభ్యర్థులుగా గుర్తించాలని కోరుతూ కమిషన్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై మంగళవారం కమిషన్‌ సమావేశంలో సభ్యులు చర్చించారు. అనంతరం ఈ నెల 22 నుంచి 26వ తేదీ మధ్య అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న గ్రూపు-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణ ఏర్పాట్లపైనా సమావేశంలో సమీక్షించారు.

Just In...