Published On: Mon, Feb 15th, 2021

గ్లోబల్‌ ఆర్గనైజేషన్స్‌తో పార్టనర్‌షిప్‌ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి మేలు

* యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌ త్రిపాఠితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌
సత్య ఎస్‌ త్రిపాఠి సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా సత్య ఎస్‌ త్రిపాఠిని సీఎం జ‌గ‌న్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంత‌రం సీఎం  జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేలా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌ త్రిపాఠితో అన్నారు. ఆర్బీకేల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లు (సీహెచ్‌సి) ద్వారా రైతులకు ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేస్ట్‌ టూ వెల్త్‌ అనే అంశంపై ప్లాస్టిక్‌ వ్యర్ధాల నుంచి, ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ను ఈ–క్లస్టర్‌ల ద్వారా సేకరించవచ్చని, ఇందుకు గాను అత్యాదునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు త్రిపాఠీ చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్ వేస్ట్‌ను కూడా రీసైకిల్‌ చేయాల్సిన ఆవశ్యకతను సీఎం వివరించారు. దీనిపై సంబందిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కార్బన్‌ న్యూట్రాలిటీ సాధించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు యునైటెడ్‌ నేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం చెప్పారు. అంతేకాక గ్లోబల్‌ ఆర్గనైజేషన్స్‌తో పార్టనర్‌షిప్‌ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి మేలు, ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అలాగే.. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు కూడా మరింత మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవరత్నాల పధకాల ద్వారా అందజేస్తున్న సంక్షేమ పధకాలు ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, చేయూత, ఆసరా వంటి పధకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు స్ధిరమైన అభివృద్దిని తీసుకువస్తాయన్న నమ్మకం తనకుందని సీఎంతో త్రిపాఠి చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా త్రిపాఠి ముఖ్యమంత్రిని అభినందించారు. కార్యక్రమంలో ఏపి కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్ ఫార్మింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ టి.విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Just In...