Published On: Thu, Jan 23rd, 2020

గ‌రుడ వాహనంపై ఉభయదేవేరులతో కోనేటి రాయుడు..!

* స్వర్గ ప్రాప్తి ఇచ్చే గరుడవాహన దర్శనం
విజయవాడభవానీపురం, సెల్ఐటి న్యూస్‌: స‌క‌ల‌చరాచర సృష్టి కారకుడు, ఈ జగత్తును నడిపించే జగన్నాథుడు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కనులారా చూసి తరించాలని అశేష భక్తజన సందోహం తండోపతండాలుగా తరలి రావడంతో  విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్ కోలాహలంగా మారింది. శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా, కోరిన వారి కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి పవిత్ర కృష్ణానదీ తీరాన కొలువై భక్తులను తరింపచేస్తున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి 14వ వార్షికోత్సవం సందర్భంగా పున్నమి ఘాట్లో రెండవ సంవత్సరం కూడా ఇక్కడే శ్రీవారి కల్యాణోత్సవాలను ఏర్పాటు చేశారు. తిరుమలలో జరిగే వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు నిత్యకైంకర్యాలతో  పూజాదికాలు నిర్వహిస్తున్నారు. స్వయంగా బ్రహ్మదేవుడే బ్రహ్మోత్సవాలను నిర్వహించాడా అన్నట్లుగా ఇక్కడ స్వామివారి వాహన సేవలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద శేష వాహనం, హనుమంత వాహనం, చిన్న శేష వాహనంతో ఇప్పటికే స్వామి వారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. నిత్యోత్స‌వాల్లో భాగంగా గురువారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తిరుప్పావడ సేవ ఇక్కడ కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామున స్వామివారి మేలుకొలుపు సుప్రభాత సేవతో హారతులు ఇచ్చి ప్రారంభించారు. తోమాల సేవ, విశ్వరూప దర్శనం, కొలువు, సహస్రనామార్చనలతో విశేష పూజలు నిర్వహించారు. మొదటి గంటా నివేదన అనంతరం సర్వదర్శనంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. యాగశాలలో మహాశాంతి హోమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా, పెదపూడి గ్రామం స్వయం అవగాహన ట్రస్ట్ శ్రీ శ్రీ శ్రీ అవధూత నిర్గుణ చైతన్య స్వామీజీతో పాటు అనేకమంది స్వామీజీలు ఇక్కడ భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఇక్కడ ప్రతిరోజు ఎలాంటి రుసుము లేకుండా భక్తులకు కల్యాణోత్సవంలో పాల్గొనేలా శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి అన్ని ఏర్పాట్లు చేశారు. వారాంతపు సేవల్లో భాగంగా గురువారం తిరుమలలో వెంకటేశ్వరస్వామికి నిర్వహించే తిరుప్పావడ సేవ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సేవలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పున్నమి ఘాట్ పరిసర  ప్రాంతాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. అనంతరం లోకకళ్యాణార్థం, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు నిత్యం సుమారు ఆరు వందల మంది దంపతులతో శ్రీవారి కళ్యాణ వేడుకలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ వైభవాన్ని అత్యంత రమణీయంగా వివరిస్తూ పండితులు భక్తులకు కళ్యాణ విశేషాన్ని వివరిస్తున్నారు. జాజి, మల్లెలు, కనకాంబరాలు మొదలైన అనేక రకాల పుష్పాలతో స్వామి వారిని అత్యంత సుందరంగా అలంకరిస్తూ అలంకార  ప్రియుడుగా స్వామి వారిని తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాదుకు చెందిన స్వీటీ అనే కళాకారిణి శంకు, చక్రాలు ఆలయ గోపురం, మొదలైన దేవతా మూర్తులు ఆకారాలతో బియ్యపు గింజలతో వేస్తున్న బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోతలతో పవిత్ర కృష్ణానదీ తీరాన, దుర్గామల్లేశ్వరులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి సమీపాన బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడంతో తిరుమలలోనే ఉన్నామా అన్నట్లుగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటోంది. కళావేదికపై అన్నమాచార్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు రాజమోహన్ స్వామివారి కీర్తనలతో భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపచేశారు. విద్యార్థినీ విద్యార్థులకు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అమ్మవారి బీజాక్షరములతో ఉచిత సామూహిక సరస్వతీ పూజ ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎం.వి.ఆర్ బుక్స్ అధినేత మామిడి లక్ష్మివెంకట కృష్ణారావు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఆకెళ్ళ విభీషణశర్మ వెంకటాచల మహత్యం గురించి చేసిన ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి సంకీర్తనలతో పాటు ఇక్కడ కళావేదికపై భక్తులచే స్వయంగా దీపాలు వెలిగించి సహస్ర దీపాలంకరణ సేవను ఏర్పాటు చేశారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి వారు గరుడ వాహనంపై అత్యంత శోభాయమానంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానము కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సమస్త వాహనాలలో శ్రేష్టమైన గరుడ వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారిని దర్శిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని, ఇహపరమైన ఈతి బాధలనుంచి ఉపశమనం లభిస్తుందని ప్రశస్తి. స్వయంగా బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను జరిపించాడా అన్నట్లుగా పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ ఒకపక్క, పండువెన్నెల్లో  చల్లని గాలులతో వింజామరలు వీస్తున్నట్లుగా మరోపక్క గరుడ వాహనంపై ఉభయ దేవేరులతో  స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. గరుడ వాహన సేవలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తరలి వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. నిర్వాహకులు గరిమెళ్ళ నానయ్య చౌదరి (నాని), దూపగుంట్ల శ్రీనివాస్, మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, ఉదయగిరి శ్రీనివాస్ బాబు, పట్నాల నరసింహారావు , కోపూరి పూర్ణచందర్రావు, కుందేపు మురళీకృష్ణ, చింతలపూడి రఘురాం, ఉమామహేశ్వర్ గుప్తా, బాలగంగాధర్, మాజేటి వెంకట దుర్గాప్రసాద్, గార్లపాటి లీలా మల్లికార్జునరావు, చలవాది మల్లికార్జునరావు, పట్నాల శ్రీనివాసరావు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. శుక్రవారం వారాంతపు సేవల్లో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అభిషేకం సేవ ఏర్పాటు చేశారు. అలానే గజవాహనంపై మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు ఉంటుంది. శుక్రవారం అమావాస్య సందర్భంగా ఉచితంగా మహిళలచే సామూహికంగా పంచాయుధరాధన సహిత కోటి కుంకుమార్చన పూజలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు విజయదుర్గా పీఠాధిపతులు ( గాడ్) చే అనుగ్రహభాషణం ఉంటుంది.
  

Just In...