Published On: Sat, Apr 14th, 2018

చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పోయింది

* నేడు జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరుతున్నా 

* మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ పొలిటిక‌ల్‌: ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహ‌న్‌రెడ్డి పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సందర్భంగా శనివారం ఉద‌యం తాను వైకాపాలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తెలిపారు. శుక్ర‌వారం  పటమటలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనతో పాటు ఉండే కార్యకర్తలు, స్నేహితులు, అభిమానులు అందరూ పార్టీ మారాలని సూచించారని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పారు. శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు క‌నకదుర్గమ్మ వారది వద్ద జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చంద్రబాబు హోదా వద్దు, ప్యాకేజీ కావాలి, మళ్లీ ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి అంటూ యూ టర్న్‌లు తీసుకోవడంతో యువతకు ప్రభుత్వంపైన నమ్మకం కోల్పోయి, తమ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందని, అందుకే  పార్టీ మారుతున్న‌ట్లు వివరించారు. ఏప్రిల్‌ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశానని, ఆయన పార్టీలోనే   కొనసాగాలని, మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం చెబుతానన్నారని తెలిపారు. 2004లో ఒకసారి చంద్రబాబు నిర్ణయంతో భంగపాటుకు గురయ్యానని, 2014లో కూడా అదే పరిస్థితి ఎదురైనా ఎప్పుడూ వివాదాలకు వెళ్లలేదని, పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. 2014లో తెలుగుదేశంలోకి ఆహ్వానించిన రోజున చంద్రబాబు సీటు ఇస్తానని వాగ్దానం చేసి, మాట నిలుపుకోలేదని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పార్టీలో కొనసాగుతున్నానా లేదా అనే అనుమానం తనకు కూడా కలిగిందన్నారు. ముఖ్య‌మంత్రిని కలవడానికి వెళితే పక్క జిల్లా మంత్రితో పాటు కృష్ణా జిల్లా మంత్రి కూడా తనను అవహేళన చేసేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం సీటు విషయంలో జగన్మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఈ సంద‌ర్భంగా య‌ల‌మంచ‌లి ర‌వి ప్రకటించారు.

Just In...