Published On: Sat, Apr 14th, 2018

చదువుతో పాటు కళల ప‌ట్ల ఆసక్తి పెంచుకోవాలి

* ఏపీ శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: వర్ణచిత్రాలు, శిల్పాలు యువకుల భావాలకు అద్దం పడుతున్నాయని, సమకాలీన సమాజ పోకడలను ప్రతిబింబిస్తున్నాయని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మొగల్రాజపురంలోని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి, విజయవాడలో శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండ‌లి బ‌ద్ధ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచుకోవాల‌ని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన కోట మృత్యుంజయరావును అభినందించి సత్కరించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ డి.విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు.  అనంతరం విద్యార్థులు రూపొందించిన వర్ణచిత్రాల లోగోను ఆయ‌న ఆవిష్కరించారు. ప్రదర్శన ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన ప్రకాశరావు, కల్చరల్‌ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోళ్ళ నారాయణరావు, చిత్రకారులు పాల్గొన్నారు.
 

Just In...